ఉత్తర చైనాలోని చాంగ్జీలో ఉన్న లియుషెన్యు బొగ్గు గనిలో సంభవించిన భారీ గ్యాస్ పేలుడులో 90 మంది మరణించారు. వందలాది మంది కార్మికులు భూగర్భంలో చిక్కుకుపోయి ఉంటారని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. బీజింగ్‌కు నైరుతి దిశలో సుమారు 520 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్యువాన్ కౌంటీలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. పేలుడుకు కొద్దిసేపటి ముందు కార్బన్ మోనాక్సైడ్ హెచ్చరిక జారీ అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో గని లోపల 247 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, ఇతర కార్మికులు చిక్కుకుపోయారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. గనిని నిర్వహిస్తున్న కంపెనీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు జిన్హువా తెలిపింది. దశాబ్దానికి పైగా కాలంలో ఇదే అత్యంత ఘోరమైన బొగ్గు గని ప్రమాదం.


