కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాక్ ఇచ్చారు. కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఫైర్ అయ్యారు. సీపీఐ మద్దతుతో గెలిచామన్న విషయాన్ని మర్చిపోవద్దని చురకలు అంటించారు. దేశవ్యాప్త పరిణామాలను చూస్తూ కూడా మారరా? అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందుతోందని అన్నారు. రుణమాఫీ రూ.2 లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారన్నారు. కులగణనలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉంటే ప్రభుత్వం సరి చేయాలని కోరారు.
మతపరమైన రాజకీయాలను అడ్డుకోవడంలో లౌకిక శక్తులు విఫలం అవుతున్నాయని కూనంనేని అన్నారు. కేజ్రీవాల్‌ను భయపెట్టించి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. హిందుత్వం ముసుగున బీజేపీ ఎవరికి మేలు చేస్తుందని ప్రశ్నించారు. 99 శాతం హిందువుల శ్రమను దోచుకొని అంబాని, ఆదానిల చేతుల్లో పెట్టడం హిందుత్వం అవుతుందా అని మండిపడ్డారు. రామా రాజ్యం పేరుతో రంగరాజన్ పై చేసిన దాడిని ఖండించారు. రంగరాజన్ పై దాడి చేస్తే విశ్వ హిందు పరిషత్ ఏం చేస్తోందని కూనంనేని ప్రశ్నించారు.