- స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ప్రకటన
- తండ్రితో పాటు ఎన్నికల బరిలోకి కుమార్తె ప్రియాంక
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ రీఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చారు. విశాఖపట్నం నుంచే పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రియాంక కూడా రంగంలోకి దిగుతుండటం విశేషం. జేడీ ప్రస్థానంలో అనేక మలుపుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ తొలుత సామాజిక రంగంలోకి వచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వటంతో పాటు బలమైన నాయకునిగా నిలిచారు. తర్వాత కాలంలో జనసేనతో పొసగక పోవటంతో రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి జేడీ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.
కొన్నిసార్లు జనసేనలోనే జేడీ తిరిగి చేరతారని వార్తలు వచ్చినా, అక్కడ ఏ మాత్రం పొసగని వాతావరణం. అలాగని, వైఎస్ జగన్‌ను అరెస్టు చేయటం ద్వారా ఏర్పడిన వ్యతిరేకతతో వైసీపీలోకి వెళ్లలేని పరిస్థితి. తెలుగుదేశంలోకి చేరితే చంద్రబాబుతో అప్పటి నుంచే కుమ్మక్కయ్యారన్న వాదనకు బలం చేకూరుతుంది. బీజేపీ నాయకులతో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, వైజాగ్ స్టీల్ అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో బీజేపీలోకి గేట్లు మూసుకొన్నాయి.
ఈ పరిస్థితుల్లో జేడీ తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. విశాఖపట్నం ఎంపీగా లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు జేడీ ఫౌండేషన్ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె ప్రియాంక కూడా పోటీకి దిగుతున్నారు. మొత్తానికి తండ్రీ కూతురు కూడా విశాఖపట్నం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు నిర్ధారణ అయింది. వాస్తవానికి కొంత కాలంగా జేడీ కూతురు ప్రియాంక విశాఖ కేంద్రంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తుండడం గమనార్హం.