అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత సైలెంట్ అయిన వంగా గీత మళ్లీ యాక్టీవ్ అయ్యారా? పవన్ కల్యాన్ మీద పోటీ చేసిన గీత.. ఇప్పుడు కాకినాడ జిల్లాలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకుంటున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చేస్తే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవిని దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు వివాదాలకు దారి తీశాయి.
తుని మున్సిపాలిటీలో బలం లేకపోయినా చైర్ పర్సన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నించింది. తిరుపతి డిప్యూటీ మేయర్, హిందూపురం తరహాలో వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు ఛలో తుని ఆందోళనకూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నాయకురాలు, లోక్‌సభ మాజీ సభ్యురాలు వంగా గీత తెలుగుదేశం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అనుసరిస్తోన్న ప్రలోభాల పర్వాన్ని ఎండగట్టారు.
వైఎస్ ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ని కుట్రలు చేయాలా అంటూ నిలదీశారు. తుని మున్సిపల్ కౌన్సిల్‌లో తమ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉందని, అధికారం మారడంతో చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అనేక రకాల కుట్రలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 30 మంది కౌన్సిలర్లల్లో తమకు 28 మంది బలం ఉందని, సంపూర్ణ మద్ధతు ఉన్నప్పటికీ తెలుగుదేశం వారిని ప్రలోభాలు భయాందోళనలుక గురి చేసేలా కుట్ర రాజకీయాలు చేయడం సరికాదని వంగా గీత అన్నారు.
తునిలో పోలీసులు సైతం తమ పార్టీ నాయకులపై ఎక్కడా లేని ఆంక్షలు విధిస్తోన్నారంటూ విమర్శించారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, తామంతా ఆమెను పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా పోలీసు అధికారులను తాము ముందుగానే విజ్ఞప్తి చేసినప్పటికీ వాళ్లు అంగీకరించట్లేదని వంగా గీత అన్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా జరగాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలను కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కూడా తప్పుపట్టారు. తమకు మెజారిటీ వచ్చేంత వరకు వైస్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయించడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఏ మాత్రం మెజారిటీ లేదని అన్నారు.
ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న వంగా గీత అకస్మాతుగా యాక్టీవ్ అవడానికి కారణాలు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో తన పరపతి పెంచుకోవాలని.. ఓటమితో తనకు జరిగిన డ్యామేజ్‌ను పూడ్చుకోవాలని గీత భావిస్తున్నారట. అందుకే ఆందోళనలు, నిరసనలకు దిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు పిఠాపురం నియోకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిప్యూటీ సీఎంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు.. వాస్తవాలు అర్థమవుతున్నాయట. అందుకే గీత మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయినట్లు తెలిసింది. ఏదేమైనా.. గీత రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తుండటం ఆమె అనుచరులకు కూడా ఉత్సాహం నింపిందట. మళ్లీ పిఠాపురంలో అడుగుపెట్టి వైసీపీని బలోపేతం చేయాలని భావిస్తున్నారట. మరి గీత ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయో వేచి చూడాలి.