33.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనంతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆయన.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ గుంజుతాం అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఇంతకీ కేటీఆర్ లాంటి విద్యావంతుడైన నాయకుడు ఇలాంటి భాష వాడటం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది

పదేళ్ల పాటు అధికార దర్పాన్ని అనుభవించి, ముఖ్యమంత్రి కాకపోయినా షాడో సీఎంగా చక్రం తిప్పిన కేటీఆర్‌కు తాజా రాజకీయ పరిస్థితులు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అధికారం కోల్పోయామన్న ఫ్రస్ట్రేషన్, ఆ బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావడంతో, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని ముందుండి నడిపించాల్సిన పూర్తి బాధ్యత కేటీఆర్‌పైనే పడింది. సీనియర్ నేత హరీష్ రావుతో పాటు ఆయన కూడా పార్టీని కాపాడుకునేందుకు నిరంతరం శ్రమించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ముఖ్యంగా రైతులకు జరుగుతున్న అన్యాయాలను వివరించాల్సిన ఆయన.. తన అసహనాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. తీవ్రమైన కోపంలో విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాషలో మాట్లాడుతున్నారు. సీఎం కుర్చీని గుంజుతాం లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు హుందాగా వ్యవహరించాల్సిన చోట, ఇలా నోరు పారేసుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. విమర్శలు హేతుబద్ధంగా ఉండాలే తప్ప, వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదన్న కనీస నియమాన్ని ఆయన విస్మరిస్తున్నారు.

ఇప్పుడు పరుష పదజాలం వాడుతున్న కేటీఆర్, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై ఎలా వ్యవహరించారో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న వాస్తవాన్ని గ్రహించాలి. అప్పట్లో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒక మాట అన్నందుకే గులాబీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రచ్చ రచ్చ చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడు అన్న కనీస గౌరవం కూడా ఇవ్వకుండా బండి సంజయ్‌ని పోలీసులతో అర్ధరాత్రి అరెస్ట్ చేయించి, రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఏ ఆధారం లేని కేసుల్లో ఇరికించి ప్రతిపక్ష నేతలను మానసికంగా వేధించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం నడిచిందన్న విమర్శలను వారు మూటగట్టుకున్నారు. నాడు అధికార మదంతో తమను ఎవరు ఏమన్నా జైలు పాలు చేసిన గులాబీ నేతలు, నేడు అధికారం పోగానే నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండటం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. నాడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ మంత్రులు మాట్లాడిన మాటలు, వాడిన భాష కూడా అనేకసార్లు వివాదాస్పదంగానే ఉండేది.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని పబ్లిక్ గా అంత మాట అంటున్నప్పటికీ, కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వెనకడుగు వేస్తోంది. కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం భయపడుతోందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. వారిపై చర్యలు తీసుకునే స్థాయి, ధైర్యం రేవంత్ ప్రభుత్వానికి లేదేమోనన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వంపై కోపం ఉంటే, దాన్ని ప్రజాక్షేత్రంలో ఆందోళనల రూపంలో చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. అంతేకానీ నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడితే ప్రజలు ఏమాత్రం హర్షించరు. పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన ఒక అగ్ర నాయకుడే ఇలా అదుపుతప్పి మాట్లాడుతుంటే, ఇక కింది స్థాయి కార్యకర్తలు ఇంకెంత రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులను లేదా రేవంత్ రెడ్డిని ఎవరూ సుద్దపూసలు అని సమర్థించడం లేదు. కానీ భావి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకునే ఒక నాయకుడు పదిమందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలా దిగజారి మాట్లాడటమే అత్యంత బాధాకరం.

కేటీఆర్‌కు తెలంగాణలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. చదువుకున్న నాయకుడిగా, ఐటీ సెక్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన తనను తాను దశాబ్ద కాలంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇటీవల ఐటీ ఉద్యోగుల సదస్సులో కూడా పాల్గొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఎంతో గొప్పగా ప్రసంగాలు చేశారు. అలాంటి ఒక కార్పొరేట్ ఇమేజ్ ఉన్న నాయకుడు సభల్లో ఇలాంటి బీ గ్రేడ్ స్థాయి మాటలు మాట్లాడటం సగటు విద్యావంతులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కేటీఆర్ మాట్లాడే మాటలను వార్తల్లో, సోషల్ మీడియాలో ఎంతో మంది మహిళలు, కుటుంబ సభ్యులు గమనిస్తుంటారు. వారి ముందు ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పదజాలం వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని పలచన చేస్తోంది. తెలంగాణ సంస్కృతి ఎప్పుడూ ఇంత కఠినమైన, బూతుల సంస్కృతి కాదు. ఉద్యమ కాలం నుంచి హుందాగా రాజకీయాలు చేసిన నేతలు ఎంతో మంది ఉన్నారు. ఈ స్థాయిలో దిగజారి మాట్లాడితే ఇక పల్లెల్లో ఉండే మామూలు నాయకులకు, ఐటీ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కేటీఆర్‌కు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ వ్యవహరిస్తున్న తీరు కూడా పూర్తి ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో ఉంటోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు జారి ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడితే చాలు, గులాబీ సోషల్ మీడియా దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి నానా యాగీ చేస్తుంది. కానీ తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పబ్లిక్ గా అంత తీవ్రమైన వ్యాఖ్యలు, బూతులు మాట్లాడుతుంటే మాత్రం అదే సోషల్ మీడియా కళ్లు మూసుకుని మౌనం పాటిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి రాజకీయంగా బీఆర్ఎస్‌కు ఏమాత్రం మేలు చేయదు. రేపటి నాడు కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కూడా తమ స్థాయిని పక్కనపెట్టి అదే భాషలో గట్టిగా కౌంటర్ ఇస్తే గులాబీ పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడక తప్పదు. అప్పుడు డిఫెన్స్‌లో పడాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమే. అందుకే ఒక జాతీయ స్థాయి పార్టీకి నాయకత్వం వహించే స్థానంలో ఉన్న కేటీఆర్ ఎప్పుడూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా బహిరంగ సభల్లో మాట్లాడే విషయంలో ఆయన తన మాటతీరును మార్చుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకే కాకుండా, తెలంగాణ రాజకీయ విలువల పరిరక్షణకు కూడా ఎంతో అవసరమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్