34.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

తెలంగాణలో హస్తం పార్టీకి అతిపెద్ద బలంగా మారిన రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎంతైతే పోరాటం చేశారో, అధికారంలోకి వచ్చాక కూడా తనదైన మార్క్ పాలనతో ఆయన అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే అంతర్గత కుమ్ములాటలను సమర్థవంతంగా తిప్పికొట్టి, అధిష్టానం మనసును సైతం గెలుచుకున్నారు. ఒకవైపు ఆర్థిక సవాళ్లు వెంటాడుతున్నా, మరోవైపు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల బకాయిల చెల్లింపు లాంటి సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ సొంత పార్టీ నేతల నుంచే ఎదురైన అడ్డంకులను రేవంత్ రెడ్డి ఎలా అధిగమించారు? ఇదే దూకుడు కొనసాగిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థాయి ఇమేజ్‌ను ఆయన తెలంగాణలో సొంతం చేసుకుంటారా?

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనితీరును పరిశీలిస్తే ఆ పార్టీలో ఒక స్పష్టమైన సంప్రదాయం కనిపిస్తుంది. అధికారం చేతికి రానంత వరకు నేతలంతా కలిసికట్టుగా అధికారం కోసం పోరాడుతారు. కానీ ఒక్కసారి పీఠం దక్కాక పదవుల కోసం ఆ పార్టీలో వర్గపోరు, కొట్లాటలు తారాస్థాయికి చేరుకుంటాయి. దీనినే ఆ పార్టీ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యంగా అభివర్ణిస్తుంటారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి రాష్ట్రాల నుంచి కేంద్రం వరకు అంతటా ఒకేలా ఉంటుంది. ఈ కుమ్ములాటల వల్లే సామాన్య ఓటర్లు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నమ్మడానికి జంకుతారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు అసాధారణ చరిష్మా ఉన్న నాయకులు పార్టీకి అతిపెద్ద బలంలా మారుతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా అలాంటి బలమే రేవంత్ రెడ్డి రూపంలో దొరికింది. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న దశాబ్ద కాలంలో, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అత్యంత బలమైన గొంతుకగా రేవంత్ రెడ్డి ప్రజల ముందు నిలబడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ఆయనను విశ్వసించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అందించి రాష్ట్ర పాలనను అప్పగించారు. ప్రజల నుంచి వచ్చిన ఈ ఏకపక్ష తీరును జీర్ణించుకోవడం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు అత్యంత కష్టంగా మారింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికల్లో గెలిచి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం ఏమాత్రం వడ్డించిన విస్తరిలా సాగలేదు. ప్రారంభ దశలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా, స్వపక్షంలోనే ఆయనకు తీవ్రమైన విపక్షం ఎదురైంది. పదవుల పంపకాల విషయంలో సొంత పార్టీ సీనియర్ నేతలే ఆయనను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. కేవలం అసంతృప్తితోనే ఆగిపోకుండా, ప్రభుత్వ అంతర్గత విషయాలను, సమాచారాన్ని పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలకు లీక్ చేసి అడ్డంకులు సృష్టించారు. ముఖ్యమంత్రి తీసుకున్న పలు ప్రభుత్వ పాలసీలను ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పదం చేసే ప్రయత్నాలు జరిగాయి. దీంతో పాలనా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో అనేక రకాల వివాదాలు రేవంత్ రెడ్డిని చుట్టుముట్టాయి. అయితే ఎప్పుడైతే రాష్ట్రంలో జరిగిన వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన తన భుజాలపై వేసుకుని ఏకపక్షంగా గెలిపించడం మొదలుపెట్టారో.. అప్పుడే రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన నాయకత్వ లక్షణాలు, విజయాలను చూసి కాంగ్రెస్ జాతీయ అధిష్టానం సైతం రేవంత్ రెడ్డికి పూర్తిగా సరెండర్ అయిపోయింది. దీంతో పార్టీ మీద, ప్రభుత్వం మీద ఆయన తిరుగులేని పట్టు సాధించారు. అంతకుముందు వరకు తోక జాడిస్తున్న కొందరు పార్టీ పెద్దలకు, అసమ్మతి నేతలకు అధిష్టానం అండతో చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. ఫలితంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పెత్తనం పరిపూర్ణంగా స్థిరపడింది.

పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రభుత్వ పాలనలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో, సంక్షేమ పథకాల విషయంలో ఆయన ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇందిరమ్మ పథకం’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గృహాల నిర్మాణాలను వేగవంతం చేశారు. భవిష్యత్తులో రెండవ దశ, మూడో దశలో కూడా పెద్ద ఎత్తున గృహాలు మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఆయన ప్రకటించారు. సామాజిక భద్రతలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసి అండగా నిలిచారు. రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అందించే విషయంలో నిధుల సమీకరణ వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, వాటన్నింటినీ అధిగమించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా, సన్న ధాన్యం పండించే రైతులకు అదనంగా బోనస్ కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా పేదల పౌష్టికాహారం కోసం, త్వరలో చౌకధరల దుకాణాల ద్వారా సన్న బియ్యంతో పాటు జొన్నలు కూడా పంపిణీ చేసే గొప్ప ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సంక్షేమ పథకాలతో పాటు, పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తిస్తూ నామినేటెడ్ పదవుల భర్తీలో సైతం రేవంత్ అదే జోరు చూపిస్తున్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ ఆయా కులాలకు కార్పొరేషన్లను కేటాయించి పదవులు భర్తీ చేశారు.

రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న టీజీఎస్ఆర్టీసీ సమస్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. సంస్థ పునరుద్ధరణ, కార్మికుల సంక్షేమం కోసం ఉన్నతాధికారులతో ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఆర్టీసీ కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కార్మికులను పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియలో ఎదురవుతున్న న్యాయపరమైన, సాంకేతిక సమస్యలన్నింటినీ తక్షణమే అధిగమించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. దీనిని బట్టి అతి త్వరలోనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడం ఖాయమని రేవంత్ బలమైన సంకేతాలు ఇస్తున్నారు. కేవలం ఆర్టీసీకే పరిమితం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలోనూ ఆయన ఎంతో ఉదారత చూపిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఉన్న వేలాది కోట్ల బకాయిలను ప్రతి నెలా ఆరు వేల కోట్ల రూపాయల చొప్పున విడతల వారీగా చెల్లించేందుకు ఆయన ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా దశాబ్దాల ఉద్యోగుల సమస్యకు ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపించారు. రేవంత్ తీసుకున్న ఈ సానుకూల నిర్ణయాలతో ఆనందం వ్యక్తం చేసిన రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, ఇటీవల ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపాయి. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ మరియు ఇతర సర్వీసు సమస్యలను కూడా త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత గడ్డు కాలంలో ఉంది. గత ప్రభుత్వం చేసిన భారీ అప్పులు, వాటికి కట్టాల్సిన వేల కోట్ల వడ్డీలు, మరోవైపు పెరగని రాబడి.. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన భారీ బకాయిలు ఇలా ఎన్నెన్నో కఠిన సవాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్ని రకాల ఆర్థిక, రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అత్యంత సావధానంగా, ఒక స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళుతున్నారు. విపక్షాలు, సొంత పక్షంలోని కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా తన కాళ్లలో పుల్లలు వేస్తున్నప్పటికీ, ఆ అడ్డంకులన్నింటినీ సునాయాసంగా ఏరుకుంటూ ఏమాత్రం బెదరకుండా ఆయన ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కనబరుస్తున్న ఇదే దూకుడు, పరిపాలనా దక్షత ఇలాగే నిరంతరాయంగా కొనసాగిస్తే.. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాధించిన స్థాయి ఇమేజ్‌ను, బ్రాండ్‌ను ఆయన కచ్చితంగా సొంతం చేసుకుంటారని పార్టీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

తెలంగాణలో హస్తం పార్టీకి అతిపెద్ద బలంగా మారిన రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎంతైతే పోరాటం చేశారో, అధికారంలోకి వచ్చాక కూడా తనదైన మార్క్ పాలనతో ఆయన అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే అంతర్గత కుమ్ములాటలను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్