బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి
రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ… వారానికో శంకుస్థాపన
వేగంగా పనిచేయాలి… అంతే వేగంగా అభివృద్ధి చూపించాలి
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదు
పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ అంతే ముఖ్యం
వినూత్నంగా ఆలోచిస్తే నిధుల కొరతను అధిగమించవచ్చు
జిల్లా కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి
కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా… ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చాం
7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
అభివృద్ధి సహా వివిధ రంగాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి గ్రామస్థాయి ఉద్యోగులను కూడా మోటివేట్ చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లే తీసుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో రెండు రోజులపాటు జరిగే 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…గత పాలకుల నుంచి రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయి. 94 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది. రూ.1.30 లక్షల కోట్ల బిల్లులు కూడా గత పాలకులు మనపై రుద్దారు. గత పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం గుంతలు పడిన రోడ్లతో విధ్వంసమైంది. అందరి సహకారంతో అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కి… వ్యవస్థలను గాడిలో పెట్టగలిగాం. ప్రజా ప్రతినిధులు-అధికారుల కలయికే ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నాం. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నాం..అని ముఖ్యమంత్రి చెప్పారు.
W-D-WC.. ఇదో సైకిల్
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన చోట ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. మంత్రుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఉద్యోగి వరకూ అంతా బాధ్యతగా ఉండాలి. వచ్చిన ఫిర్యాదులు వందశాతం పరిష్కారం కావాల్సిందే. ఆర్థికేతర ఫిర్యాదులను పరిష్కరించకుండా.. కొందరు పైకి కిందకు ఫైళ్లు తిప్పుతున్నారు… వాటిని తక్షణం పరిష్కరించాలి. ఆర్థికపరమైన ఫిర్యాదుల గురించి కూడా విచారణ చేసి సరైన వాటిని పరిష్కరించాలి. 2027 మార్చి నాటికల్లా రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన కావాలి. సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచనలు చేస్తే సుపరిపాలన అందించినట్టే. డబ్బులు లేవనడం కాదు… సంపద సృష్టికి పని చేయాలి… చేద్దాం. వెల్ఫేర్, డెవలప్‌మెంట్, వెల్త్ క్రియేషన్ అనేది ఓ సైకిల్. అభివృద్ధి లేకుండా సంపద లేదు. సంపద లేకుండా సంక్షేమం లేదు. సూపర్ సిక్స్ పథకాలతో భద్రత, భరోసా కల్పించాం. పీ4తో ఆర్ధిక ప్రమాణాలు పెంచుతున్నాం. 26 కొత్త పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ అంటే నమ్మకాన్ని కల్పించాం. రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాన్ని డ్రైవ్ చేయడమనేది గర్వంగా ఉండేది. కాలేజీ రోజుల్లో ఎన్ ఫీల్డ్ డ్రైవ్ చేయడాన్ని గొప్పగా ఫీలయ్యేవాళ్లం. అలాంటి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చాం. రూ. 23 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం. ఇవి సాకారమైతే 24 లక్షల మేర ఉద్యోగాలు వస్తాయి. గ్రీన్ ఎనర్జీతో పాటు గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నాం. డేటా, ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుంది. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చాయి. రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాం. వేసవిలో దేశ ప్రజలను చల్లబరిచే ఏసీలు మన రాష్ట్రం నుంచే సరఫరా చేసే పరిస్థితికి వచ్చాం.. అని సీఎం వివరించారు.
బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేసే కలెక్టర్లే నోడల్ ఆఫీసర్లు
గత ప్రభుత్వం అనవసరంగా ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో పెట్టేసింది. కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్న పరిస్థితి ఉంది. భూముల విషయంలో జీరో ఎర్రర్ రికార్డులు తయారు చేయాలి. రోడ్లు, వంతెనలు, ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు. పబ్లిక్ రిలేషన్స్ ఎంతో ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యం. లాస్ట్ మైల్ లో ఉండే ఉద్యోగిని కూడా మోటివేట్ చేస్తే అద్భుతంగా పని చేయగలరు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి 0.30 పైసల మేర కొనుగోలు వ్యయం తగ్గించాం. మరో 0.30 పైసలు త్వరలోనే తగ్గిస్తాం… తొలిసారి ట్రూ డౌన్ చేయగలిగాం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాం… ఆన్ లైన్ లో పన్నులు కట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి టాపర్ల ఫోటోలతో యాడ్ ఇచ్చాం. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చాటి చెప్పాం. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ దిశగా అడుగులు వేస్తున్నాం. అన్ని రంగాల్లో… అన్ని వ్యవస్థల్లో ఏపీ పనితీరు బెంచ్ మార్క్ గా మారాలి. జిల్లాలు, కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి. జిల్లాల్లో అమలు చేసే ఉత్తమ పద్దతులను బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేస్తాం… ఆ కలెక్టర్లనే వాటికి నోడల్ ఆఫీసరుగా పెడతాం. సీయింగ్ ఇజ్ బిలీఫ్ అనే విధానంలో 3 రోజుల కార్యదర్శులు, 6 రోజులు హెచ్‌వోడీలు, 8 రోజులు కలెక్టర్లు ఫీల్డ్‌కు వెళ్లాలి. సామాజిక మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలి. రిజల్ట్ ఓరియేంటేషనుతో ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఆఫీస్ టెల్స్ యూ డేటా… ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్.. దీన్ని గుర్తు పెట్టుకోవాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ స్లోగన్… గవర్నెన్స్ డిసైడ్స్ ద స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఫైల్స్ షుడ్ నాట్ మూవ్… రిజల్ట్స్ షుడ్ మూవ్.. అప్పుడే ప్రజలకు మంచి సేవలు అందుతాయి.. అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.


