నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆరె మరాఠ సంఘ భవనంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జై భవాని జై శివాజీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుండి శివాజీ చౌక్ వరకు ప్రధాన వీధుల గుండా శోభయాత్రను నిర్వహించారు. శోభయాత్రలో అశ్వం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అశ్వం నృత్యం చేస్తు అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. శివాజీ చౌక్ వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించి కొబ్బరికాయలు కొట్టారు. ప్రతి ఒక్క యువకుడు ఛత్రపతి శివాజీ చరిత్రను తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పలువురు ఆకాంక్షించారు. దేశం కోసం, ధర్మం కోసం, ఛత్రపతి శివాజీ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుండే రామాయణం, మహాభారతం, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలను తెలియజేయాలని అన్నారు. అప్పుడే ధర్మం, దేశం అలాగే స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుందన్నారు.