వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియత్రించేందుకు..వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. నేడు కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల, నేరెళ్ళ వాగును సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై..ఇన్‌స్పెక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని సీపీ అధికారులకు సూచించారు.
అక్రమ ఇసుక రవాణా కట్టడికై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా..కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్పాటు చేసిన ఇసుక చెక్ పోస్ట్‌ను వరంగల్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా ముందుగా తనిఖీ నిర్వహిస్తున్న తీరును సంబంధిత చెక్ పోస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీలు జరిపే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా తనిఖీ చేసిన వాహన వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో కూడా తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.