తెలంగాణలో హింసాత్మక చర్యలకు బీఆర్ఎస్ ఆజ్యం పోస్తోందా?

బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత వివాదాస్పదమైన పిలుపునిచ్చారు. సప్ప సప్పగా ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఎవరూ పట్టించుకోరని, ప్రజల అటెన్షన్ డ్రా చేయాలంటే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. మన ప్రాంతంలో ఉన్న రైల్వే లైన్లను ఒకరోజు కోసిపారేయాలని, సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు, ధాన్యం కొనుగోళ్ల ఆందోళనలకు రైతులు రావడం లేదని సుమన్ స్వయంగా అంగీకరించారు. వంద మంది ఆందోళన చేస్తే అందులో ఐదుగురే రైతులు ఉంటున్నారని, మిగతా వారంతా మన పార్టీ వాళ్లే ఉంటున్నారని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే విధ్వంసాలు సృష్టించక తప్పదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఆస్తుల ధ్వంసం కేసుల్లో నెల రోజులు జైలుకు వెళ్లొస్తే ఎలాంటి నష్టం లేదని, అదొక గోల్డ్ మెడల్ సాధించినట్లుగా గర్వంగా ఫీల్ అవ్వాలని కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు.

బాల్క సుమన్ చేసిన ఈ విధ్వంసకర వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థపై చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టమనడం ఉగ్రవాద మనస్తత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సైతం సుమన్ తీరును ఎండగట్టారు. బాల్క సుమన్ ఒక రాజకీయ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, ఆయనపై వెంటనే కేంద్ర రైల్వే శాఖ పోలీసులు దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందిస్తూ కాల్చేయడం, పేల్చేయడం ఎవరి డైరెక్షన్ అని మండిపడ్డారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా సుమన్ వ్యాఖ్యలను ఖండించారు. అధికారం కోల్పోయి ఒడ్డున పడ్డ చేపలా బీఆర్ఎస్ విలవిలలాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా డీజీపీకి, స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కామెంట్స్ తీవ్రతను గ్రహించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ వెంటనే యూట్యూబ్ నుంచి ఆ వివాదాస్పద భాగాన్ని పక్కనపెట్టింది.

తన వ్యాఖ్యలపై నలువైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత, పోలీస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బాల్క సుమన్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి తాను మాట్లాడితే, ఆ అసలు విషయాలను పక్కనపెట్టి మంత్రులు తనపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని మాత్రమే తాను పిలుపునిచ్చానని సుమన్ చెప్పుకొచ్చారు. ప్రజలు, కార్మికుల్లో ఉన్న తీవ్రమైన ఆక్రోశాన్ని మాత్రమే తాను తన ప్రసంగంలో ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. తనకు పోరాటాలు, లాఠీ దెబ్బలు, జైలు జీవితం ఏమీ కొత్త కాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై ఏకంగా రెండు వందల ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తాను చూడని పోలీస్ స్టేషన్ లేదని, తనపై నాలుగు సార్లు పోలీసులు లాఠీఛార్జ్ చేశారని గతాన్ని గుర్తు చేసుకుంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

బాల్క సుమన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించడం ఆయనకు అలవాటుగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయనలోని అసహనం మరింత పెరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణల్లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు ఫిబ్రవరి 18న సుమన్‌ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన తగ్గుముఖం పట్టలేదు. గతంలో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా, స్టేజ్ పైనే తన కాలి చెప్పులు చూపిస్తూ అనుచితంగా ప్రవర్తించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో మంచిర్యాల పోలీసులు సుమన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేశారు. అధినేతల దృష్టిలో పడాలన్న అత్యుత్సాహంతోనే ఆయన తరచుగా ఇలాంటి వివాదాలు కొనితెచ్చుకుంటున్నారని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం, ధర్నాలు, రాస్తారోకోలు లాంటి శాంతియుత నిరసనలు చేయడం ప్రతిపక్షాల కనీస హక్కు. కానీ ప్రజా పోరాటాల ముసుగులో ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని, వ్యవస్థలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం ముమ్మాటికీ తీవ్రమైన నేరం కిందకే వస్తుందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల మద్దతు లభించడం లేదనే తీవ్ర నిరాశతోనే కేడర్‌ను హింస వైపు పురికొల్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఒక మాజీ ప్రజాప్రతినిధి హోదాలో ఉండి కార్యకర్తలను చట్టబద్ధమైన పోరాటాల వైపు నడిపించాల్సింది పోయి, జైలుకు వెళ్లడాన్ని ఘనకార్యంగా అభివర్ణించడం వారి జీవితాలను అంధకారంలోకి నెట్టడమే అవుతుంది. క్రిమినల్ కేసులు నమోదై, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే ఆ కార్యకర్తల కుటుంబాలు రోడ్డున పడతాయన్న కనీస స్పృహ నాయకులకు ఉండాలని పౌర సమాజం హితవు పలుకుతోంది. రాజకీయాల్లో దూకుడుగా ఉండటం తప్పు కాదు, కానీ అది మిలిటెంట్ తరహా దాడులకు దారితీసేలా ఉండకూడదు. అధికారం లేనప్పుడు ప్రజాక్షేత్రంలో మరింత బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఏ నాయకుడైనా రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles

12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్