ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ భారతీయుడిని జోర్డాన్ సైనికులు కాల్చి చంపారు. మృతి చెందిన వ్యక్తిని కేరళలోని తుంబా నివాసి థామస్ గాబ్రియేల్ పెరెరాగా గుర్తించారు. ఈ సంఘటన ఫిబ్రవరి 10న జరిగినట్లు తెలుస్తోంది.
జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన మేరకు, “దురదృష్టకర పరిస్థితుల్లో ఒక భారతీయ పౌరుడు మరణించడం విచారకరం” అని తెలిపింది.
“రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. డెడ్‌బాడీని పంపించడానికి జోర్డాన్ అధికారులతో కలిసి పనిచేస్తోంది” అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
విజిటర్ వీసాతో జోర్డాన్‌కి వెళ్లిన పెరెరా(47).. అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. మృతుడి బంధువు, మేనంకుళం నివాసి అయిన ఎడిసన్ కూడా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో సైన్యం అతనిపై కూడా కాల్పులు జరిపింది. అయితే అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స పొందిన తర్వాత అతన్ని భారతదేశానికి తిరిగి పంపించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో, వెస్ట్ బ్యాంక్‌లో హింస పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.