ఇటీవల సినిమాల్లోని క్యారెక్టర్లు, దర్శకుల తీరుపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సినిమాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలె మృతి చెందిన అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న వెంకయ్యనాయుడు దేశ ద్రోహులు, స్మగ్లర్లు హీరోలా.. అంటూ సీరియస్ అయ్యారు.
ఇటీవల భారతీయ సినిమాల్లో వస్తున్న హీరోల పాత్రపై వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. నటన బాగా చేయడం వేరు.. కానీ స్మగ్లర్లు, దేశ ద్రోహులను, తప్పుడు విధానాలు పాటించే వాళ్లను హీరోలుగా చూపిస్తున్నారని.. అలాంటి విధానాలను పిల్లల ముందు పెట్టకూడదని హితబోధ చేశారు. సినిమా కథ రాసుకునేటప్పుడు ప్రమాణాలు పాటించాలని సూచించారు.
గతంలో సినిమాలు అంటే ఏదో ఒక సందేశం ఉండేదని వెంకయ్య అన్నారు. ఇప్పడు సినిమాల్లో దేశ ద్రోహం, స్మగ్లర్లు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వారితో పాత్రలు రూపకల్పన చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని అన్నారు. “ఇప్పుడు నెగెటివ్ క్యారెక్టర్లని హీరోలు గా చేస్తున్నారు, చాలా తప్పు ఇది. స్మగ్లర్లను, దేశ ద్రోహులను చూపించి హీరోయిజం అంటున్నారు. అలాంటి ఆదర్శాలను పిల్లల ముందు పెట్టకూడదు.” అని చెప్పారు.
సినీ పరిశ్రమ ఎప్పుడూ బాధ్యతాయుతమైన మాధ్యమంగా ఉండాలని సూచించారు. చెడు పాత్రల ద్వారా సమాజంలో చెడు భావనలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హీరోల పాత్రల ప్రభావం పిల్లలపై అధికంగా పడుతుందని, సున్నితమైన ఈ విషయాలపై సినీ పరిశ్రమలో విస్తృత చర్చ జరగాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.