తాను అరెస్టు అయ్యానంటూ వచ్చిన వార్తలను మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఖండించారు. తాను అరెస్టు కాలేదని వీడియో రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. తనను దుబాయ్‌లో అరెస్టు చేశారని.. ఈ కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో తన ఇంట్లో ఉన్నానని తెలియజేశారు. తప్పుడు ప్రచారన్ని నమ్మొద్దని తాండూరు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్‌లో మృతి చెందారని వార్తలు వచ్చాయి. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేశా నిర్మాతగా వ్యవహరించారు. ఓ సినీ ఫైనాన్సియర్ కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం తన ఫ్లాట్‌లో నిద్రపోయిన కేదార్ .. నిద్రలోనే మృతి చెందాడని తెలుస్తోంది.
కేదార్ మృతికి కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. కేదార్ నిద్రించిన ఫ్లాట్‌లోనే తెలంగాణకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ మాజీ ఎమ్మెల్యేను దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అని ప్రచారం జరిగింది. దీంతో రోహిత్ రెడ్డి స్పందించారు. తాను దుబాయ్‌లో లేనని.. తాను తన ఇంట్లోనే ఉన్నానని వీడియోలో వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఏడాది కిందట గచ్చిబౌలి పరిధిలోని రాడిసన్ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో కేదార్ పాల్గొన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్‌తో పాటు.. కొందరు సినీ ప్రముఖులు, దర్శకుడు క్రిష్, ఇండస్ట్రీకి చెందిన జూనియర్ మహిళా ఆర్టిస్టులు సైతం హాజరయ్యారని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు.