సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్
వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం..ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు నమోదైంది. దీంతో పోసానిని హైదరాబాద్ లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై.. హైదరాబాద్ లోని రాయదుర్గం చేరుకున్నారు. పోసానిని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట..పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది.
తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో నటుడు పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగారు. తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా అరెస్ట్ చేస్తున్నామని తమకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. కేసు ఉంటే దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వైసీపీ హయాంలో ఏపీఎఫ్ టీవీడీసీ ఛైర్మన్ గా పోసాని పనిచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ను అసభ్యకరంగా దూషించారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పోసాని ప్రెస్ మీట్ పెట్టి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.