ఏపీ అసెంబ్లీలో ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడి నోటి వెంట నుంచి జగన్‌ను క్షమిస్తున్నానంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్పీకర్ హోదాకు జగన్ దురుద్దేశాలు ఆపాదించారని చెప్పిన అయ్యన్న … అయినప్పటికీ ఆయనను క్షమిస్తున్నానని పేర్కొన్నారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని అన్నారు.
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక రూలింగ్ ఇచ్చారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారని చెప్పారు. స్పీకర్‌కి హైకోర్టు సమన్లు ఇచ్చినట్టుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్పీకర్‌కు దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందని అన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌ను క్షమిస్తున్నానని అన్నారు. ఇక ముందుకూడా జగన్ ఇలాగే వ్యవహరిస్తే ఏం చేయాలో సభకే వదిలిపెడుతున్నానంటూ బదులిచ్చారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
జగన్ పిటిషన్ ను ఆధారం చేసుకుని హైకోర్టు స్పీకర్ కు నోటీసులు జారీ చేసిందని కూడా వైసీపీ ప్రచారం చేసిందని అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా సభలో ఆరోపించారు. అయితే ఇందులో వాస్తవం లేదని చెప్పారాయన. హైకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కూడా ఆయన సభాముఖంగా తెలియజేశారు. మొత్తంగా అన్నీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్.. సభా మర్యాదలను మంటగలిపారని మండిపడ్డారు. ఈ లెక్కన జగన్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్ గా తనకు ఉందన్నారు. అయితే వీటన్నింటినీ సంధి ప్రేలాపనలుగా భావిస్తూ జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న వ్యాఖ్యానించారు. జగన్ తన ధోరణి మార్చుకోకపోతే మాత్రం ఆయనను ఏం చేయాలన్న దానిపై సభ ఆలోచన చేస్తుందని ఆయన హెచ్చరించారు.


