తెలంగాణలో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కాకరేపుతోంది. ఇటీవల పది మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేరుగా సమావేశమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చిట్‌చాట్ సందర్భంగా చెప్పారు. ఒక్క పార్టీ ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేంటన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయని, విషయాలన్నీ దీపాదాస్ మున్షీతోనే చెప్తానని చెప్పారు.
వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా తనకు ఆహ్వానం ఉందని చెప్పారు. తాను వెళ్లలేదని, కావాలంటే తన కాల్ రికార్డు చెక్ చేసుకోవాలన్నారు. అయినా ఒకే పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం తప్పేంలేదని అనిరుథ్‌రెడ్డికి సపోర్ట్ పలికారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటం, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ రంగంలోకి దిగారు. రాత్రి ఆమె హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగే కీలక సమావేశంలో పాల్గొంటారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఈ కీలక భేటీ జరగనుంది.
ఎమ్మెల్యేలను నాలుగు గ్రూపులుగా చేసి వారితో ముగ్గురు నేతలు చర్చించనున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
సాయంత్రం 4.15 నుండి 5.15 వరకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
సాయంత్రం 6.45 నుండి 7.45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అనిరుథ్ రెడ్డి వద్ద ఉన్న ఆధారాలేంటన్న ఉత్కంఠ నెలకొంది.