నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో చైన్ స్నాచర్లు హల్చల్ చేశారు. తానూర్ బైపాస్ రోడ్డు హనుమాన్ ఆలయం సమీపంలోని కాలనీకి చెందిన సుంకరి సుప్రియ అనే మహిళ ఇంటి బయట బీడీలు చేసుకుంటుండగా ఆమె మెడలో నుండి 3 తులాల బంగారన్నీ దుండగులు దొంగిలించారు. ఎవరికి అనుమానం రాకుండా బైక్‌పై వచ్చిన దుండగులు ఫోన్‌లో మాట్లాడినట్టు చేసి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని గమనించి, ఎవరు లేరని తెలుసుకుని బీడీలు చేసుకుంటున్న మహిళ మెడలో నుండి బంగారాన్ని లాక్కొని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సంబంధిత సీసీ టీవీ ఫుటేజీని ముధోల్ సీఐ మల్లేష్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.