ప్రజా సమస్యలపై పోరాటాలకు కాషాయదళం సై అంటోందా..? ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నేతలు మరింతగా గళం విప్పనున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు.. త్వరలోనే సర్కారు విధానాలను ఎండగడుతూ మరింతగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భగ్గుమంటోంది బీజేపీ. ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రజలకే వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతున్నారు కమలనాథులు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులు.. ఇలా వివిధ అంశాల్లో ప్రభుత్వంతో పోరాటానికి దిగుతోంది కాషాయపార్టీ.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా రైతు భరోసా పథకంలో చేసిన మార్పులు కమలనాథులకు ఓ పోరాట అస్త్రాన్ని అందించినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ఇప్పటికే వివిధ అంశాలపై పోరుబాట పట్టింది కాషాయ పార్టీ. గ్రూప్ వన్ పరీక్షల విషయంలో విద్యార్థులకు మద్దతుగా ర్యాలీ తీశారు కేంద్రమంత్రి బండి సంజయ్. వేలాది మంది విద్యార్థులతో కలిసి చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరీక్షలు రీషెడ్యూలు కాకపోయినా బీజేపీ మాత్రం విద్యార్థుల తరఫున నిలబడింది అన్న పేరు సంపాదించుకుంది.
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయం ఘటనలోనూ కమలం పార్టీ నేతలు శరవేగంగా స్పందించారు. క్షేత్రస్థాయిలో హిందూ సంఘాలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఆయా వర్గాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ విషయంలోనూ బాధితుల పక్షం వహించింది కాషాయ పార్టీ. పేదల ఇళ్లు కూల్చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు.. నిజంగా ఆక్రమణలు కూల్చాలని నిర్ణయిస్తే.. ఒవైసీ బ్రదర్స్‌కు సంబంధించిన అక్రమ కట్టడాలను మొదటగా నేలమట్టం చేయాలని డిమాండ్ చేస్తోంది. సల్కం చెరువు ఆక్రమించి నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చాలని డిమాండ్ చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వినతిపత్రం ఇచ్చారు కమలం నేతలు.
మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చడాన్ని తప్పుపడుతోంది బీజేపీ. కాలుష్య కాసారంగా మారిన మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే.. బాధితులకు ప్రభుత్వం తరఫున సరైన న్యాయం జరగాలని.. భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సర్కారు తరఫున సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను సైతం స్వీకరించి.. మూసీ పరివాహక ప్రాంతంలో ఒకరోజు నిద్రచేశారు. వారి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇలా వివిధ అంశాలపై పోరుబాట పడుతున్న బీజేపీ నేతలు.. రానున్న రోజుల్లో మరింతగా క్షేత్రస్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్లలోనూ సత్తా చాటాలని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారన్న అభిప్రాయం పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.