గ్రూమింగ్ గ్యాంగ్ల అంశం ప్రస్తుతం బ్రిటన్ ను కుదిపేస్తోంది. పిల్లలు అలాగే కౌమారశదశలో ఉన్నవారితో గుర్తు తెలియని వ్యక్తులు సంబంధాలు పెట్టుకోవడం, వారిని వేధింపులకు గురిచేయడాన్ని గ్రూమింగ్ అంటారు. దీని కోసం అనేకమంది వ్యక్తులు కలిసి ఒక గ్యాంగ్ గా పనిచేస్తుంటారు. ఈ బృందాలనే గ్రూమింగ్ గ్యాంగ్‌లు అంటారు. బ్రిటన్ లో ఇప్పటికీ ఇటువంటి గ్రూమింగ్ గ్యాంగ్‌లు ఎక్కువగా ఉన్నాయని అనేక దర్యప్తు సంస్థలు వెల్లడించాయి.
కాగా ఈ గ్రూమింగ్ గ్యాంగ్‌ల విషయంలో ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది ఒక ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు….ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్. 2008 -2013 మధ్య కాలంలో పాకిస్తాన్ మూలాలు ఉన్న ఒక వ్యక్తి ఓల్డ్ హోమ్‌లో లైంగిక వేధింపుల గ్యాంగ్‌లను నడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో కీర్ స్టార్మర్ క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్‌గా ఉన్నారు. అయితే గ్రూమింగ్ గ్యాంగ్ ల లైంగిక వేధింపులను కీర్ స్టార్మర్ పట్టించుకోలేదని ఎలన్ మస్క్ ఇటీవల ఆరోపణలు చేశారు.
అయితే ఎలన్ మస్క్ అరోపణలను బ్రిటన్ క్యాబినెట్ ఖండించింది. దీనిపై బ్రిటన్ ఆరోగ్య శాఖామంత్రి వెస్ స్ట్రీటింగ్ స్పందించారు. ఎలన్ మస్క్ తప్పుడు సమాచారం ఆధారంగా కీర్ స్టార్మర్ పై ఆరోపణలు చేశారని వెస్ స్ట్రీటింగ్ వెల్లడించారు. అయితే బ్రిటన్ ప్రభుత్వ వివరణతో ఎలన్ మస్క్ సంతృప్తి చెందలేదు. బ్రిటన్ పార్లమెంటును కింగ్ ఛార్లెస్ రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు.
కాగా కిందటేడాది జులైలో జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ పరాజయం పాలైంది. పధ్నాలుగేళ్ల పాటు బ్రిటన్ లో అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగించిన కన్జర్వేటివ్ పార్టీకి బ్రేకులు పడ్డాయి.దశాబ్దకాలానికి పైగా అధికారానికి దూరంగా ఉన్న లేబర్ పార్టీకి బ్రిటన్ ఓటర్లు జై కొట్టారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా చేశారు.దీంతో లేబర్ పార్టీ అగ్ర నాయకుడు కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇంగ్లాండ్, స్కాట్లండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లండ్ వ్యాప్తంగా మొత్తం 650 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 326 సీట్లు రావాలి. అయితే లేబర్ పార్టీకి 368 పైచిలుకు సీట్లు లభించాయి.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చడంలో కీర్ స్టార్మర్ కీలక పాత్ర పోషించారు. కన్జర్వేటివ్ ప్రభుత్వం అవలంబించిన విధానాల్లోని లోపాలను ఎన్నికల ప్రచారంలో కీర్ స్టార్మర్ ఎండగట్టారు. ఏఏ అంశాల్లో కన్జర్వేటివ్ ప్రభుత్వం విఫలమైందో ఆయన ఓటర్లకు వివరించారు. అంతేకాదు కన్జర్వేటివ్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బ్రిటన్ అభివృద్దిలో మరో వందేళ్ల వెనక్కి పోతుందని నిప్పలు చెరిగారు. కన్జర్వేటివ్ ప్రభుత్వ వైఫల్యాలను కీర్ స్టార్మర్ నిర్మాణాత్మకంగా ఎండగట్టిన తీరు బ్రిటన్ ఓటర్లను బాగా కనెక్ట్ అయింది. అంతేకాదు ఎన్నికలలో గెలిచి లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే …తాము ఏం చేస్తామో ఓటర్లకు అర్థం అయ్యేటట్లు వివరించారు కీర్ స్టార్మర్. పన్నులు పెంచకుండా, ప్రజలపై భారం లేకుండా చూస్తానని ఎన్నికల ప్రచార సభల్లో ఆయన హామీ ఇచ్చారు. అలాగే బ్రిటన్‌లో నెలకొన్న ఇండ్ల సంక్షోభాన్ని కూడా పరిష్కరిస్తానని ఓటర్లకు కీర్ స్టార్మర్ హామీ ఇచ్చారు. కీర్ స్టార్మర్ ఇచ్చిన ఈ హామీ…బ్రిటన్ మధ్య తరగతి వర్గాన్ని బాగా ఆకట్టుకుంది.