మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పక్షమైన మహాయుతిలో విభేదాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకవైపు శరద్ పవార్, అజిత్ పవార్ లు మళ్లీ కలవడానికి రంగం సిద్దమవుతుంటే మరో వైపు శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల గడ్చిరోలి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ పరంగా కసరత్తు చేశారు. అంతేకాదు గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి పర్యటనను శివసేన అధికార పత్రిక సామ్నా ఆకాశానికి ఎత్తేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. గడ్చిరోలి అనగానే ఇప్పటివరకు బయటి ప్రపంచానికి నక్సలైట్ల అడ్డాగానే తెలుసునని వ్యాఖ్యానించింది. అయితే అటువంటి నక్సలైట్ల అడ్డా అయిన గడ్చిరోలిని స్టీల్ సిటీగా మార్చడానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని సామ్నా పత్రిక సంపాదకీయం పేర్కొంది. ఈ సంపాదకీయానికి …కంగ్రాట్స్ దేవ్‌బాబూ…అంటే హెడ్డింగ్ కూడా పెట్టింది సామ్నా.
మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ఉప్పు నిప్పుగా ఉంటాయి. శివసేన యూబీటీ వర్గం ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడీలో ఉంటే బీజేపీ మాత్రం అధికారపక్షమైన మహాయుతి కూటమిలో ఉంది. వైరిపక్షమైన ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన విమర్శలు చేస్తుందని సహజంగా అందరూ భావిస్తారు. అయితే అందుకు భిన్నంగా ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రశంసల జల్లు కురిపించింది.
కాగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సామ్నా పత్రిక అభినందించడం మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని సామ్నా పత్రిక ఒక పాలసీగా పెట్టుకోలేదన్నారు. సర్కార్ వైఫల్యాలను తాము ఎండగట్టినా, దానిని కేవలం నిర్మాణాత్మక విమర్శగా తీసుకోవాలన్నారు. ప్రజల పక్షాన పాలకులతో పోరాటం చేయడమే సామ్నా విధానమన్నారు. అయితే ప్రజలకు పనికొచ్చే మంచి పనులు ప్రభుత్వం తలపెడితే, అప్పుడు తప్పకుండా సర్కార్ ను అభినందిస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వం మంచి పనులు చేసినా విమర్శించాలన్న నియమం సామ్నా పత్రిక పెట్టుకోలేదని సంజయ్ రౌత్ వివరణ ఇచ్చారు. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఫలితంగా ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయంటే, సదరు నిర్ణయాలను తాము స్వాగతిస్తామన్నారు సంజయ్ రౌత్.
కాగా గడ్చిరోలి ప్రాంతంలో అభివృద్ధి కోసం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించినవారిలో శివసేన యూబీటీ ఒక్కటే కాదు…శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా గడ్చిరోలి ప్రాంత రూపురేఖలు మారుతాయని తాము ఆశిస్తున్నట్లు ఎన్సీపీ లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఆర్‌ఆర్ పాటిల్ పేరు ఆమె ప్రస్తావించారు. గడ్చిరోలి ప్రాంతాన్ని అభివృద్దికి చిరునామాగా మార్చడానికి ఆర్‌ఆర్ పాటిల్ ప్రయత్నించారని సుప్రియా సూలే పేర్కొన్నారు. ఆర్‌ఆర్ పాటిల్ అడుగుజాడాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుస్తున్నారని సుప్రియా సూలే ప్రశంసించారు.