ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. సాహిబాబాద్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ నుండి న్యూ అశోక్ నగర్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రయాణించిన మోదీ పాఠశాల పిల్లలతో ముచ్చటించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. 12 వేల 200 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరఠ్ నమో భారత్ కారిడార్ ను ప్రారంభించారు. దాదాపు 4 వేల 600 కోట్ల రూపాయల విలువైన ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు.
నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్ ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహిబాబాద్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ నుండి న్యూ అశోక్ నగర్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలతో మోదీ ముచ్చటించారు.
సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కిలోమీటర్ల విభాగంలో 6 కిలోమీటర్ల మేర భూగర్భంలో నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారని అధికారులు వివరించారు.
ఢిల్లీ మెట్రో ఫేజ్ IVలోని జనక్‌పురి , కృష్ణా పార్క్ మధ్య దాదాపు 1,200 కోట్ల రూపాయల విలువైన 2.8 కిలోమీటర్ల అదనపు సెక్షన్ ను మోదీ ప్రారంభించారు. పశ్చిమ ఢిల్లీలోని కృష్ణా పార్క్, వికాస్పురిలోని కొన్ని ప్రాంతాలు, జనక్‌పురి , ఇతర ప్రాంతాలు ఈ కొత్త మార్గం ద్వారా ప్రయోజనం పొందుతాయి. దాదాపు 6 వేల 230 కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ మెట్రో ఫేజ్ IVలోని 26.5 కిలోమీటర్ల రిథాలా-కుండ్లీ సెక్షన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ ఢిల్లీలోని రిథాలా నుండి హర్యానాలోని నాథుపూర్ కి కలుపుతుంది.
న్యూ ఢిల్లీలోని రోహిణిలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ కోసం కొత్త అత్యాధునిక భవనానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ క్యాంపస్ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ , వైద్య మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ప్రాజెక్ట్ వల్ల ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వంతో విసిగిపోయారని చెప్పారు. ప్రస్తుతం నగరవాసులు దేశ రాజధానిని అభివృద్ధి బాటలో నడిపే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. తాజాగా ప్రారంభించిన నమో భారత్ కారిడార్ ఢిల్లీకి మీరఠ్‌కు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ప్రధాని వివరించారు.