ఏడాదిలో 55, 143 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బిహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్ లు వస్తున్నారని.. ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నా అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ అభయహస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 20 మంది సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
హైదరాబాద్ ప్రజాభవన్‌లో రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీతో పాటు సింగరేణి కార్మికుల ప్రమాద బీమా కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలకు రాష్ట్రం నుంచి ఎంపికైన 20 మంది అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట ఆర్థిక సాయం అందించారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సివిల్స్ కు ఈ సారి రాష్ట్రంలో నుంచి 40 మంది మెయిన్స్ పరీక్షలు రాయగా…అందులో 20 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. దీంతో వారిలో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఖర్చుల నిమిత్తం సింగరేణి సంస్థ నుంచి సాయం అందించారు.
అభ్యర్థులకు చెక్కులు అందజేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్నా రాష్ట్రం కోసం కృషి చేయాలన్నారు. మార్చి 31 లోపు గ్రూప్ -1 నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రం నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలకు వెళ్లే వారిని చూస్తే గర్వంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ఇదే వేదికగా సింగరేణి సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రతి కార్మికుడికి 1.25 కోట్ల ప్రమాద బీమా భద్రత కల్పించడానికి సంబంధించి సింగరేణి సంస్థకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమయంలో సింగరేణి చైర్మన్, సీఎండీ బలరాం నాయక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.