తెలంగాణ గీతం, రాజముద్రపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు. అయితే,.. రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. అలాగే రాజముద్రలో మార్పులపై కూడా దృష్టి సారించింది ప్రభుత్వం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోగోతోపాటు గీతాన్ని అధికారికంగా విడుదల చేయనుంది.
తెలంగాణ ఉద్యమకాలంలో ఉత్సహాన్ని నింపుతూ, యావత్ రాష్ట్ర ప్రజలను ఉర్రూతలూగించిన జయహే జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలో ఆవిష్కరించనుంది కాంగ్రెస్ సర్కార్. 2 నిమిషాల 30 సెకన్లతో రాష్ట్ర గీతం సాగనున్న ఈ గీతంలో మొత్తం 13 చరణాలతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉండగా.. దాని ఔనత్యం ఏమాత్రం దెబ్బతినకుండా.. కీరవాణి ఆయన బృందం పాటను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం.
ఇకపోతే గత బీఆర్‌ఎస్ సర్కార్ రూపొందించిన రాజముద్ర మార్పుపై కూడా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. గతంలో ఉన్న చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ ఉద్యమం, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలను పొందుపరిచేలా లోగో ఉండాలని పట్టుబడుతోంది. ఈ మేరకు రాజముద్రను మారుస్తోంది. అయితే,..లోగో కలర్ మాత్రం అలాగే ఉండనుంది. ఇక తెలంగాణ రాజముద్ర మార్పుతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర అధికారిక చిహ్నాం ఎలా ఉంటుంది.. ఏంటి అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే అధికారిక చిహ్నానికి సంబంధించి మూడు రకాల లోగోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక మరోవైపు తెలంగాణ చిహ్నాం మార్పుపై బీఆర్‌ఎస్ అభ్యంతరం చెబుతోంది. కాకతీయుల కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడంపై మండిపడుతోంది. రాష్ట్రంలోని ఉన్న చారిత్రక ప్రత్యేకత, ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తిని కొనసాగించేలా ఉండేందుకు వీలుగా కేసీఆర్ రాజముద్రలో కళాతోరణానికి స్థానం కల్పించారని కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. తెలంగాణ సంస్కృతికి తూట్లు పొడిచేలా, ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నిరసన బాట పట్టింది.


