పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకోను న్నాయా? ముఖ్య మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా జోడు పదవుల్లో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి వైదొలిగితే ఆయన స్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కే సూచనలున్నాయి? అసలు ఎవరెవరు రేసులో ఉన్నారు? కేవలం ఇవే కాదు.అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు మార్చాలని హస్తం హైకమాండ్ భావిస్తోంది? అన్నది ఆసక్తిరేపుతోంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక, ఫలితాలు రావడమే తరువాయి. జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధించారు. ఎవరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు అన్నది తేలనుంది. ఇన్నాళ్లూ ప్రచారాన్ని హోరెత్తించిన నేతలు, ఎన్నికల కోసం వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలిన లీడర్లు. ఇప్పుడు మళ్లీ రోజువారీ రాజకీయ కార్యకలాపాలపై, పార్టీ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ మార్పు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తగా మరొకరు రాబోతున్నారన్న ప్రచారం మొదలైంది.
నిజానికి గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు రేవంత్ రెడ్డి. నాటి ఎన్నికల్లో సీనియర్లందరినీ ఏకతాటిపైకి తేవడంతోపాటు పదేళ్లుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన హస్తం పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకొచ్చారాయన. గులాబీ బాస్ కేసీఆర్‌తోపాటు కారు పార్టీ అగ్రనాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. నాటి అధికారపార్టీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్ని రాష్ట్ర ప్రజల అభిమానం సంపాదించారు. దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ మరోమాట లేకుండా రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి సీనియర్లందరినీ పక్కన పెట్టి మరీ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రేవంత్‌కు ఓటేశారు రాహుల్ గాంధీ. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే అప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉన్నారు రేవంత్ రెడ్డి. దీనికితోడు ముఖ్యమంత్రి కూడా కావడంతో జోడు పదవులు ఉన్నట్లైంది. అయితే పీసీసీ చీఫ్‌గా వేరే వారిని నియమిస్తామని, అప్పట్లోనే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేసింది. కానీ, లోక్‌సభ ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ సమయంలో పీసీసీ చీఫ్‌ను మారిస్తే కొత్తగా నియమితులైన నాయకుడికి తగినంత సమయం ఉండదని, తద్వారా పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని అనుకున్న స్థాయిలో ముందుకు నడిపించడం కష్టతరమవుతుందని భావించింది. దీంతో ఇప్పటివరకు రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్‌గా సైతం కొనసాగించింది.
అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నా జోడు పదవుల్లో కొనసాగడం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ కార్యకలాపాలను, అటు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లడంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితులు కన్పిస్తున్నాయని ఆయన సహచరులే చెబుతున్నారు. పైగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి. మేనిఫెస్టో అమలు చేయడం ప్రతిష్టాత్మకంగా మారింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన గ్యారెంటీ అని చెప్పడంతో పథకాల అమలును దగ్గరుండి మరీ పర్య వేక్షిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వ పాలన అంశానికి సంబంధించి ఆయన ఎక్కువ సమయం కేటాయిం sచాల్సి ఉంది. కానీ, పీసీసీ పదవి కూడా ఉండడం. పార్టీ కార్యక్రమాలు మీద పడుతుండడంతో అంతగా సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది.ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని, పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరానికి మార్చింది. దీంతో జూన్ నాలుగున ఫలితాలు వెలువడిన తర్వాత దీనికి సంబంధించిన కసరత్తు జరగనుంది. అయితే, ఇప్పటికే పలువురు నేతలు పీసీసీ పీఠంపై దృష్టి సారించారు. ఇందులో కొందరు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతుంటే, మరికొందరు రాష్ట్ర స్థాయిలో తమకున్న పరిచయాలను ఉపయోగించుకొని హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తెలంగాణ పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అయితే.. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉండడంతో పీసీసీ వేరే సామాజిక వర్గానికి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆయన ఉండడం, ఆయన సోదరుడు మల్లు రవికి పార్లమెంటు టికెట్ ఇవ్వడంతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు భట్టికి దక్కడం అనుమానంగానే కన్పిస్తోంది. కానీ, ఆయన వర్గీయులు మాత్రం కర్ణాటక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తు న్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, పీసీసీ చీఫ్‌గా ఉండగా, మల్లు భట్టికి సైతం అదే విధంగా అవకాశం కల్పించాలని హైకమాండ్ దృష్టికి తమ విన్నపాలు చేరేలా అంతర్గతంగా ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
కేవలం వీళ్లే కాదు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన సంపత్ కూడా పీసీసీ కోసం ప్రయత్నాలు చేస్తు న్నారు. చిన్న వయసులోనే ఏఐసీసీలో పనిచేసిన అనుభవం ఉండడం, కాంగ్రెస్ పార్టీకి దిన అగ్రనేతలతో సత్సం బంధాలు ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారాయి. ఇక, సామాజిక వర్గం పరంగా చూసినా సంపత్‌కు సానుకూల వాతావరణం కన్పిస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇక, బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు సైతం పీసీసీ చీఫ్ రేసులో గట్టిగా విన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకోనుంది. ఆ లెక్కన చూస్తే మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్‌లు ప్రధానంగా కన్పిస్తున్నారు. వీరిద్దరికీ రేవంత్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ హస్తం హైకమాండ్ ఎస్టీకి అవకాశం ఇవ్వాలని భావిస్తే.. సీతక్క పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు ప్రజల్లో ఆదరణ, అభిమానాలు పుష్కలంగా ఉండడంతోపాటు మహిళ కావడం సీతక్కకు కలిసి వచ్చే అంశంగా మారనుంది.
ఏది ఏమైనా జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేసే అవకాశాలు సహజంగానే కన్పిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారం అంది తే ఒకలా మరోసారి భంగపాటు ఎదురైతే ఇంకోలా ఢిల్లీ పెద్దలు వ్యవహరించే అవకాశాలు ఉన్నా యి. ఈ రకంగా చూస్తే, ఎలాగైనా పీసీసీకి కొత్త వ్యక్తి రావడం మాత్రం ఖాయమనే చెప్పాలి. మరి.. ఆ వచ్చే వారు ఎవరు అన్నది తేలాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.


