ఎస్‌ఐబీ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు… విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరిం పులు వంటి అంశాల చుట్టూ తిరిగింది. తాజాగా మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోనూ లింకులు బయటపడ్డాయి. దీంతో.. మరికొందరు పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
2022 నవంబరులో మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి ఈ ఎపిసోడ్‌తో హాట్‌టాపిక్‌గా మారారు. ఈ నలుగురి ఫోన్లను ఎస్‌ఐబీ డీఎస్పీ హోదాలో ప్రణీత్ అండ్ కో ట్యాప్ చేయడం వల్లే.. అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఈ విషయాన్ని ముందుగా గుర్తించినట్లు ఇప్పుడు చర్చ జరుగుతోంది. అప్పట్లో అతి కొద్ది మంది పోలీసు ఉన్నతాధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరగడానికి ఒకరోజు ముందు ఎస్‌ఐబీ అధికారులు ఫామ్‌హౌస్‌కు వెళ్లి… 72 కెమెరాలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రామచంద్ర భారతి, నందకు మార్, సింహయాజి స్వామీజీల సీటింగ్ ఏర్పాట్లు కూడా ప్రణీత్ అండ్ కో డైరెక్షన్‌లోనే జరిగినట్లు… అందుకు తగ్గట్లుగా ఎమ్మెల్యేలకు తర్ఫీదునిచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించారు.
ఈ ఆపరేషన్ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ఫుటేజీలను రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుని, బీజేపీ ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుంది. 2022 నవంబరు 3న అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతిభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఫుటేజీలను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మె ల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రను గురించి విలేకరులకు వివరించారు. సుప్రీంకోర్టు సహా.. దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు ఈ ఫుటేజీలను పంపినట్లు వెల్లడించారు. దర్యాప్తు అధికారులు ఓ దశలో ఈ కేసులో ఢిల్లీ పెద్దల తలుపుతట్టేదాకా పరిస్థితి వెళ్లింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారుల కోసం స్పెషల్ ఫ్లైట్‌ను బుక్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వారు ఢిల్లీతోపాటు.. కేరళలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ పలువురికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాలని ఆదేశిం చారు. అయితే.. దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్‌లను ఏర్పాటు చేసిందెవరు? అందులో ప్రయాణిం చిన అధికారులెవరు? అనే కోణంపైనా ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు దృష్టి సారించారు.


