ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీ ఉండదు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – సెర్ఫ్ – ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పింఛను లబ్ధిదారులు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపి గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ పెన్షన్ తీసుకోవాలి. వాలంటీర్లు పెన్షన్ సహా ఏ నగదు పంపిణీ చేయడానికి వీలు లేదు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అమలు లోకి వచ్చిన తర్వాత, ప్రతి నెలా మొదటి రోజునే లబ్ధిదారులకు ఇంటివద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అందజేస్తూ వచ్చారు. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తాత్కాలికంగా ఆ సౌకర్యం రద్దయింది. ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పెన్షన్ సహా అన్ని నగదు పంపిణీ పథకాలకూ వాలంటీర్లను దూరం పెట్టింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండలు ముదిరి పోయాయి. ఈ తరుణంలో వాలంటీర్ల సేవల వినియోగంపై ఆంక్షల వల్ల వేలాది మంది వృద్ధులు, వికలాంగులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీలో అధికార పక్షం సీఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. టీడీపీ, జనసేన కుట్ర వల్లే సీఈసీ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచీ వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష పూరితమైన ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల నియమావళి పేరుతో పెన్షన్ల పంపిణీని అడ్డు కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయమన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో వైసీపీకి, మేలు జరుగుతుందనే భయం చంద్రబాబులో ఉందన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నామని ఈసీ చెబుతోందన్నారు. అది చంద్రబాబు జేబు సంస్థ అని సజ్జల ఆరోపిం చారు.
వాలంటీర్లపై చంద్రబాబు కుట్రచేసి, పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారా యణ అన్నారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే డీఎస్సీ ని ప్రకటించామని బొత్స గుర్తు చేశారు. ఎన్నికల పేరుతో వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయక పోవడం వల్ల అవ్వ, తాతలు ఇబ్బంది పడుతారని మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కక్షపూరిత పనులతో ఇబ్బంది పడేది వాలంటీర్లు కాదు.. లబ్ధిదారులని విమర్శించారు. వాలంటీర్లపై ఆంక్షల నిర్ణయంపై ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని విజ్ఙప్తి చేశారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ పై టీడీపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియకు వాలంటీర్లను దూరం చేసి… పింఛన్ దారులను ఇబ్బం దులకు గురిచేస్తు న్నారన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం వాలంటీర్లు ఎన్నికల ప్రచారానికి, పెన్షన్ల పంపి ణీకి దూరంగా ఉండాలి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాతే మళ్లీ వాలంటీర్లకు అవకాశం వచ్చేది.


