దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగగా..తాజాగా పోస్టర్ల వార్ నడుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వీధుల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ‘మోదీ హఠావో, దేశ్ బచావో’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లను తొలగించిన పోలీసులు వంద మందికిపైగా కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీంతో ఆప్ నేతలు బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క పోస్టర్ కే ఎందుకు భయపడుతున్నారంటూ బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దీంతో బీజేపీ కూడా ఢిల్లీ(Delhi) సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించింది.
‘అరవింద్ కేజ్రీవాల్ హఠావో ఢిల్లీ బచావో’ అంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లను ప్రదర్శించింది. ఈ పోస్టర్లపై స్పందించిన కేజ్రీవాల్.. ప్రజాస్వామ్యంలో పోస్టర్లు ద్వారా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కానీ బీజేపీ నేతలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన అమాయకులను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని.. అలా అరెస్ట్ చేయడం ప్రధాని మోదీ అభద్రతాభావానికి నిదర్శనమన్నారు. తనకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్న వారిని మాత్రం అరెస్టు చేయవద్దని కేజ్రీవాల్ పోలీసులను ఆదేశించారు.
Read Also: రైతులకు అండగా ఉంటాం.. పదివేల పరిహారం ఇస్తాం- KCR
Follow us on: Youtube Instagram