వీసీల రాజీనామా అంశం శాసనమండలిని హీటెక్కించింది. వీసీల రాజీనామాలపై చర్చ సందర్భంగా మండలిలో రచ్చ జరిగింది. బలవంతంగా వీసీలతో రాజీనామా చేయించారంటూ వైసీపీ వాదించింది. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అంటోంది. బెదిరించినట్టుగా ఆధారాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలంటూ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. విచారణకు పట్టుబడుతూ వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళం మధ్య మండలి రేపటికి వాయిదా పడింది.
వీసీల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారో లేదో విచారణ జరిపితే తెలిసిపోతుందున్నారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అయితే బెదిరించినట్టు వీసీల రాజీనామా లేఖల్లో ఎక్కడుందో చూపించాలంటూ మంత్రి నారా లోకేశ్ సవాల్ చేశారు.
వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారు.. ఆధారాలు కూడా ఉన్నాయి.. దీనిపై విచారణ జరిపించాలని కూడా వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు చెప్పడంతోనే వీసీలు రాజీనామా చేశారని అన్నారు. ఇక బొత్స వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బెదిరించినట్టు ఆధారాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని అన్నారు. అర్హత లేని వారిని వైసీపీ హయాంలో వీసీలుగా నియమించారంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేసిక్ 5వ తరగతి గ్రామర్ కూడా రాని వారిని వీసీల పదవులు ఇచ్చి కూర్చోబెట్టారని మంత్రి ఎద్దేవా చేశారు.
17 మందిలో ఐదుగురు రాజీనామా చేశారు. ఐదుగురిలో ఒకరు రాజారెడ్డి చెల్లెలి కోడలు. వైసీపీ కార్యకర్త ప్రసాద్ రెడ్డి ఉన్నారని లోకేశ్ మండలిలో వివరించారు.
“టీడీపీ నేతలు చెప్పడంతోనే వీసీలు రాజీనామా చేశారు. రాజీనామా లేఖల్లోనూ వీసీలు ప్రస్తావించారు. బెదిరించినట్టు ఆధారాలు ఉన్నాయి విచారణ జరిపించాలి”.. అని బొత్స అన్నారు.
“బెదిరిస్తే రాజీనామా చేసినట్టుగా ఏ ఒక్కరూ చెప్పలేదు. బెదిరింపు అనే పదం ఎక్కడుందో చూపించాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ విషయంపై ప్రివిలేజ్ కమిటీ వేస్తాం. ప్రివిలేజ్ కమిటీకి వేస్తామంటే ఎందుకు భయపడుతున్నారు. ఇంగ్లీష్ గ్రామర్ తెలియని వాళ్లను కూడా వీసీలుగా వైసీపీ నియమించింది. వర్సిటీల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలను వీసీలు జరుపుతారు”.. అంటూ లోకేశ్ ఫైరయ్యారు.
బెదిరించకపోతే వీసీలను రాజీనామా చేయమని హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ఎందుకు కోరారని బొత్స ప్రశ్నించారు. వీసీల రాజీనామాలపై విచారణ చేస్తారా.. లేదా అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశం మీద తీవ్ర గందరగోళం నెలకొనడంతో మండలిని రేపటికి వాయిదా వేశారు.