మొన్న హైదరాబాద్‌లో, నిన్న అనంతపురంలో .. భయంకరమైన కథనాలు. విద్యార్థినిలు ఉండే హాస్టల్స్ బాత్రూమ్‌లో కెమెరాలు, తొంగి చూడటం వంటి ఘటనలు ఆగ్రహానికి గురి చేశాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిల మాన, ప్రాణాలకు రక్షణ లేదని బాధితులు బయటకు వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి. ఇక్కడే కాదు ఛేజింగ్ రూమ్స్, హోటల్స్, మాల్స్‌లో కూడా హిడెన్ కెమెరాలు పెట్టడం.. వాటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం.. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఏ పని చేయాలన్నా ఆడవాళ్లు సంకోచిస్తున్న పరిస్థితి.
హోటల్స్, మాల్స్, హాస్టల్స్‌లోనే అనుకుంటే.. తాజాగా హాస్పిటల్స్‌లోనూ ఇదే పరిస్థితి..డాక్టర్ల దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్న వీడియోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. గుజరాత్‌లోని ప్రసూతి ఆస్పత్రిలో ఓ మహిళకు పరీక్షలు చేస్తున్న వీడియో సోషల్ మీడియా, టెలిగ్రామ్ ఛానెల్స్‌లో అప్‌లోడ్ అయింది. చాలా సేఫ్‌గా భావించే ఇన్‌స్టిట్యూషన్‌లో ఆడవాళ్ల సెక్యూరిటీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
సీసీటీవీ ఫుటేజ్‌లో.. రాజ్‌కోట్‌లోని పాయల్ ప్రసూతి ఆస్పత్రిలో ఓ నర్సు మహిళా రోగులకు ఇంజెక్షన్లు ఇస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇవి ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. ఈ వీడియోలు చివరికి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వచ్చాయి.
ఈ విషయంపై ఆస్పత్రి డైరెక్టర్‌ను అడిగితే.. సీసీటీవీ సర్వర్ హ్యక్ అయిందని సమాధానమిచ్చాడు.
“ఈ వీడియోలు ఎలా వైరల్ అయ్యాయో మాకు తెలియదు. మా సీసీటీవీ సర్వర్ హ్యాక్ అయినట్టు అనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందో మాకు కూడా తెలియదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేయమని కోరతాము”..అని ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు చెప్పాడు.
రాజ్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లను విచారణ చేస్తున్నారు.
“వీడియోలలోని కంటెంట్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియోలను ఎవరు తీశారు? ఏ ఉద్దేశ్యంతో తీశారు? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాము. సైబర్ క్రైమ్ ఐటీ చట్టంలోని 66E,67 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం” అని పోలీసులు తెలిపారు.