అధికారుల అలసత్వం, ఉదాసీనత వల్ల జల్‌జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ పథకం కింద కొన్ని రాష్ట్రాలు కేంద్రం నుంచి 40 నుంచి 50 వేల కోట్లు తెచ్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఇంకా డీపీఆర్‌లు కూడా సిద్ధం చేసుకోలేని దుస్థితిలో ఉండటమేంటని అధికారులను నిలదీశారు. ఈ పథకం వచ్చే ఏడాది ముగిసిపోతుందని, ఇక నిధులు ఎలా వాడుకోగలరని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో కేంద్ర పథకాల వినియోగంపై చర్చ వచ్చినప్పుడు.. ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు.
బ్యూరోక్రసీ జాప్యంతో ఇలాంటి అవకాశాలను కోల్పోవడం రాష్ట్రానికి నష్టమని అన్నారు చంద్రబాబు. అధికారుల్లో నిర్లిప్తత, ఉదాసీనత పనికిరాదని సూచించారు. కేంద్రం నుంచి ఏ పథకాల కింద నిధులు తెచ్చుకోగలమో అధ్యయనం చేసి, మంత్రులకు చెప్పాల్సిన వారే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా?’ అని చంద్రబాబు అక్షింతలు వేశారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసిందిని అన్నారు. మన ప్రభుత్వం వాటిని సరిదిద్ది, అవకాశాలను అందిపుచ్చుకొని, రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయాలి కదా? డీపీఆర్‌ల తయారీకే నెలల కొద్దీ సమయం తీసుకుంటే ఎలా?’ అని నిలదీశారు. మంత్రులు, కార్యదర్శులు బాధ్యత తీసుకుని, కేంద్ర పథకాల వినియోగంపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సీఎం వ్యాఖ్యలతో ఏకీభవించారు. జల్‌జీవన్ మిషన్‌పై ఢిల్లీలో తనకు కూడా అదే అనుభవం ఎదురైందన్నారు. అధికారుల కొద్దిపాటి చొరవతో పరిష్కారమయ్యే సమస్యలను దీర్ఘకాలం పట్టించుకోకుండా, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని పవన్ కళ్యాణ్ అసహనం చెందారు.