ఎస్ఎల్ బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ఊపందుకున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, సింగరేణి టీమ్స్ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. రెస్క్యూ బృందంలో మొత్తం 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 125 మంది ఎస్డీఆర్ఎఫ్, 23 మంది సింగరేణి సిబ్బంది పాల్గొంటున్నాయి. భారీ మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
నాగర్ కర్నూలు జిల్లా దగ్గర శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎల్ బీసీ) సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం సొరంగంలో పైకప్పు కూలడంతో చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లు,. ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులను బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందాలతో మంత్రి జూపల్లి కూడా సొరంగంలోకి వెళ్లారు.
సొరంగంలో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు 13.5 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్లాయి. మరో అర కిలోమీటరు వెళ్లాల్సి ఉండగా.. మట్టి కూలడం, నీటితో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడింది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి.
సొరంగంలోకి భారీ జనరేటర్ ని పంపించారు అధికారులు. మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్ తో సొరంగంలోకి వెళ్లారు రెస్క్యూ టీమ్. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నిన్న ఉదయం ఎస్ఎల్ బీసీ సొరంగ మార్గంలో కార్మికులు పనులు చేస్తుండగా 14వ కిలోమీటరు దగ్గర పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. సొరంగం లోపల 8 మంది చిక్కుకుకోగా.. పలువురు తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్ బీసీ ఇన్ లెట్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకూడా SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. SLBC సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఘటనకు సంబంధించి వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.