చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రితో పాటు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రూ. 430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంది. 9 ప్లాట్ ఫామ్‌లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలెటర్లు , 2 విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటైంది.
హైదరాబాద్‌లో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పాత రైల్వే స్టేషన్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ముందే టికెట్ బుకింగ్ మొదలైంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 18 వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ఆర్టీసీ , ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులో ఉంచుతామంటున్నారు రైల్వే అధికారులు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో 26 ట్రైన్ల ఆపరేషన్ జరగనుంది. అలాగే భవిష్యత్తులో 30 పైగా ట్రైన్లు టెర్మినల్ నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.