తెలంగాణలోకి చంద్రబాబు అడుగుపెట్టబోతున్నారా? కేసీఆర్ చెప్పింది నిజమవ్వబోతుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. టీడీపీ చివరి సారిగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. 2019లో ఏపీలో కూడా అధికారం కోల్పోయిన తర్వాత.. చంద్రబాబు తన ఫోకస్ మొత్తం ఏపీ మీదే పెట్టారు. టీడీపీకి బలమైనే బేస్ ఏపీనే కావడంతో.. అక్కడ పార్టీ పునర్ వైభవం కోసం గట్టిగానే కష్టపడ్డారు. ఇక ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉండటంతో పాటు.. కేంద్రంలో కూడా కీలకంగా మారిపోయారు. దీంతో మరోసారి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారట.
తెలంగాణలో టీడీపీని మరోసారి బలోపేతం చేయడానికి చంద్రబాబు గతంలో కొంత ప్రయత్నించి విఫలమయ్యారు. బీసీ నేత ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించి 2014లో ఎన్నికలకు వెళ్లారు. ఆర్ కృష్ణయ్య ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచినా.. టీడీపీ మాత్రం ఓడిపోయింది. 2018లో కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టు పార్టీలను ఏకం చేసి మహాకూటమిగా పోటీ చేశారు. అప్పుడు కూడా టీడీపీకి నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలే చేశారు. మొదటి నుంచి బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీకి.. తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించారు. కానీ ఆయన వల్ల పార్టీ పెద్దగా లాభపడింది లేదు. 2023 ఎన్నికలకు ముందు జ్ఞానేశ్వర్ కూడా పార్టీని వదిలి వెళ్లిపోయారు.
ఇక ఇటీవల టీడీపీలోకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్తారంటూ వార్తలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తుంది. కొంత కాలంగా సొంత కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు కూడా జారి చేసింది. అయితే తీన్మార్ మల్లన్నకు రాజకీయంగా చాలా పెద్ద ఆశలు, లక్ష్యాలు ఉన్నాయని.. రాష్ట్రమంతటా తిరుగుతూ బీసీలను ఏకం చేసే పని పెట్టుకోవడం వెనుక ఇదే కారణమనే టాక్ వినిపిస్తుంది. అయితే మల్లన్న దూకుడును వాడుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయ పునరుద్దరణ కోసం ఆ పార్టీ వ్యూహకర్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారట. బీసీలపైనే మళ్లీ దృష్టి పెట్టి.. వారి ఓట్ల ద్వారా పార్టీ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేస్తున్నారట. బీసీ నేత తీన్మార్ మల్లన్నకు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ఉంచారని.. ఆయన కూడా కొంత మేర సానుకూలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తెలంగాణలో బీసీ ఉద్యమానికి టీడీపీ అండగా ఉండాలని భావిస్తుందట. ఆ విధంగా బీసీ ఓటర్లను ఆకర్షించవచ్చని.. ఇప్పటికే ఈ విషయంలో సభలు, సమావేశాలు పెడుతున్న తీన్మార్ మల్లన్నకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే సత్ఫలితాలు ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.
తీన్మార్ మల్లన్నను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేకపోయినా.. టీడీపీకి అధ్యక్షుడిని మాత్రం చేసే ఆలోచన ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న.. ఆ పదవిని వదులుకొని టీడీపీలోకి వెళ్లిపోతారా? లేదంటే కాంగ్రెస్‌లోనే కొనసాగుతుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మల్లన్న కనుక టీడీపీలో చేరితే తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లోకి దూసుకొని పోయే స్వభావం ఉన్న తీన్మార్ మల్లన్న.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న టీడీపీ కలిస్తే తప్పకుండా ఒక ప్రభంజనం సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
వాయిస్ వోవర్ 6: కాగా.. మల్లన్నపై ఉన్న వ్యతిరేకతను కూడా టీడీపీ పరిశీలిస్తుందట. ఆంధ్రా పార్టీ అని ముద్రపడిన టీడీపీలో మల్లన్న చేరతారా? చేరినా.. ఆయనపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి నష్టం చేకూర్చదా? అన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి మల్లన్నను టీడీపీలోకి తీసుకొని వచ్చి పార్టీ పగ్గాలు అప్పగించాలనే కసరత్తు మాత్రం జరుగుతోందట. మరి ఇది తెలంగాణలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.