గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెండోరోజు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. వంశీని విజయవాడ సబ్ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. సబ్ జైలు నుంచి నేరుగా ప్రభుత్వాస్పత్రికి వంశీని తరలించి… వైద్య పరీక్షల అనంతరం కృష్ణాలంక పీఎస్‌కి తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. రెండో రోజు వంశీని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా పోలీసులు ప్రశ్నించనున్నారు. సత్య వర్ధన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రశ్నించునున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరులోని ఓ పొలం వివాదంలో వంశీ ఆదేశాలతో అతని అనుచరుల పేరుతో దౌర్జన్యం చేసి పొలం రిజిస్ట్రేషన్ చేయించారని కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఎవరికి చెప్పలేదని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు వీరవల్లిలో ఓ కంపెనీ వచ్చిన సమయంలో రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వటంలో అవకతవకలకు పాల్పడ్డారని రైతులు ఇచ్చిన ఫిర్యాదు తో వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తన భూమిని కబ్జా చేశాడని నిన్న ఓ న్యాయవాది భార్య గన్నవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాల పై ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఫిర్యాదు చేయడంతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇలా వంశీపై ఊహించని విధంగా ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదవుతుండడం వైసీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. వైసీపీ శ్రేణులు మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.