తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ .. పార్టీలో అంతర్గత విభేదాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పటాన్ చేరులో కాంగ్రెస్ నేతల మధ్య వివాదంపై దృష్టి పెట్టారు. దీనిపై మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదంపై ఆమె ఆరా తీశారు. మెదక్ పార్లమెంట్ నేతలతో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాన్ చెరు వివాదంపై నేతలతో చర్చించారు. కాటా శ్రీనివాస్‌తోనూ మాట్లాడారామె. సమన్వయంతో పనిచేయాలని అల్టిమేటం జారీ చేశారు. తనకు అన్ని విషయాలు తెలుసునని చెప్పారు. పార్టీ అన్ని విషయాలను గమనిస్తోందన్నారు. కార్యకర్తలకు ఏ మాత్రం అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దామోదర రాజనర్సింహతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ” సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటుంన్నానని అన్నారు. నియోజకవర్గ ఇంఛార్జిలు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని కాట శ్రీనివాస్ గౌడ్.. మీనాక్షికి చెప్పారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా.. ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని మీనాక్షిని కాట శ్రీనివాస్ కోరారు. అధికారులు తమ మాట వినడం లేదని మరి కొందరు నేతలు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా బిఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందని పలువురు నేతలు మీనాక్షితో అన్నట్లు తెలుస్తోంది.