ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు ఆమెకు అలర్జీ వచ్చిందని.. అయినా గంగా నదిలో పుణ్యస్నానం చేస్తారని తెలుస్తోంది.
నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహరాజ్ మాట్లాడుతూ.. లారీన్ పావెల్ సంగంలో పుణ్యస్నానం చేస్తారని చెప్పారు. అప్పటి వరకు శివిర్‌లో విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి లారీన్ ఎప్పుడూ వెళ్లలేదని.. ఆమె చాలా సాదాసీదాగా ఉంటారని చెప్పారు. పూజా సమయంలో కూడా తమతోనే ఉన్నారని చెప్పారు. ఎప్పుడూ చూడని వారు కూడా చూడాలని కోరుకుంటారని.. అదే మన సంప్రదాయమని అన్నారు.
144 ఏళ్లలో అరుదైన ఖగోళ ఘట్టాన్ని గుర్తుచేసే మహా కుంభ్‌మేళాలో పాల్గొనేందుకు సోమవారం ఆమె ప్రయాగ్‌రాజ్ వచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు. అప్పటి వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఆమె ఉంటారు.
కమలగా పేరు మార్చుకున్న లారీన్
లారీన్ పావెల్ జాబ్స్ తన పేరు మార్చుకున్నారు. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ చేరుకున్న ఆమె తన పేరును ‘కమల’గా మార్చుకున్నారు. స్వామి కైలాసానంద గిరి మహరాజ్.. లారీన్ జాబ్స్‌కు కమల అని నామకరణం చేసినట్లు తెలిసింది. లారీన్‌కు కమల అని గత శుక్రవారం (జనవరి 10న) నామకరణం చేశామని కైలాసానంద గిరి మహరాజ్ వెల్లడించారు. ఆమె భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి అని ఆయన చెప్పారు. ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు. భారత్ చేరుకున్న లారీన్ వారణాసి వెళ్లారు. అక్కడ కాశీ విశ్వేశ్వరుడిని బయట నుంచే దర్శించుకున్నారు.