ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ వైఖరి పట్ల మండిపడుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఏర్పాటు నుంచి బలమైన కోటగా ఉండేది. సీనియర్ రాజకీయ నాయకుడు మేకపాటి చంద్రశేఖర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ 2012లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఉపఎన్నికలో మేకపాటి ఘన విజయం సాధించారు. అయితే 2014లో టీడీపీ తరపున బొల్లినేని వెంకట రామారావు విజయం సాధించారు. కానీ 2019లో వైసీపీ ప్రభంజనంలో తిరిగి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. కానీ 2024లో మేకపాటి ఓటమిపాలయ్యారు.
2024లో ఉదయగిరి టీడీపీ టికెట్ కోసం బొల్లినేని, కాకర్ల సురేశ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కాకర్ల సురేశ్‌కు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో బొల్లినేని వర్గం పూర్తిగా సైలెంట్ అయ్యింది. కాకర్ల విజయం కోసం బొల్లినేని చివరి వరకు పని చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉంటే ఉదయగిరిలో కాకర్ల సురేశ్ గెలవడం అసాధ్యమని టీడీపీ నాయకులు కూడా నమ్మారు. రాష్ట్రమంతా టీడీపీ గెలిచినా.. ఉదయగిరిలో మాత్రం గెలవదంటూ స్వయంగా కొంత మంది టీడీపీ నాయకులు అప్పట్లో ప్రచారం చేశారు. ఇక వైసీపీ నాయకులైతే కాకర్ల గెలుపు అసాధ్యం అనే రీతిలో మాట్లాడారు. అప్పట్లో కాకర్ల సురేశ్ ప్రచారానికి వైసీపీ నేతలు అనేక ఆటంకాలు సృష్టించారు.
కాకర్ల సురేశ్ దగ్గర డబ్బులు లేవని.. ఆయనకు టీడీపీ నాయకులు పూర్తిగా మద్దతు తెలపడం లేదని భారీగా ప్రచారం జరిగింది. అయితే కాకర్ల సురేశ్ తన స్వచ్చంధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. తనకు ఒక సొంత టీమ్‌ను పెట్టుకొని మొత్తం ఎలక్షన్‌ను సొంతగా నడిపించుకున్నారు. టీడీపీ నాయకులు పూర్తిగా సహకరించకున్నా, వైసీపీ నుంచి ఆడ్డంకులు ఎదురైనా.. సురేశ్ మాత్రం తనదైన శైలిలో ఎలక్షనీరింగ్ చేసి దాదాపు 10 వేల ఓట్లతో విజయం సాధించారు. రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు సాధించిన మెజార్టీతో పోలిస్తే కాకర్ల సాధించిన మెజారటీ తక్కువే అయినా.. ఆయన ఒక్కడే నిలబడి గెలవడం టీడీపీ నాయకులను కూడా ఆశ్చర్యపరిచింది.
ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరునెలల్లో కాకర్ల సురేశ్‌పై ఎలాంటి అభియోగాలు లేవు. ఆయన అందరినీ కలుపుకొని పోతూ.. చాలా సాఫ్ట్ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీ శ్రేణులకు నచ్చడం లేదంటా. వైసీపీ హయాంలో అనేక మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారు. వీటిని రద్దు చేయడానికి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాము గతంలో ఎన్నో కష్టాలు పడి పార్టీ కోసం కేసులు కూడా ఎదుర్కున్నాము. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే సురేశ్ మాత్రం వైసీపీ వారి పట్ల మెతక వైఖరి అవలంభిస్తుండటం మాకు నచ్చడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట.
వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కేడర్ బయటకు రావడం లేదు. కానీ ఉదయగిరి నియోజకవర్గంలో ఆరు నెలలకే మేకపాటి వర్గం యాక్టీవ్ అయిపోయిందట. కాకర్ల సురేశ్ సాఫ్ట్ కార్నర్ చూపించడం వల్లే.. మళ్లీ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అసలు ఇప్పట్లో వైసీపీ కోలుకోదని మేం భావించాం.. కానీ మా ఎమ్మెల్యే అసలు ఏ విషయాలు పట్టించుకోక పోవడం.. గతంలో మేకపాటి వర్గీయులు చేసిన అరాచకాలపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంతో ఆ పార్టీ నాయకులు మళ్లీ రెచ్చిపోతున్నారని టీడీపీ నాయకులు వాపోతున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఇతర పార్టీలపై కక్షపూరిత రాజకీయాలకు చోటివ్వడం లేదు. దీంతో గతంలో కాంట్రాక్టులు, ఇతర దందాలు చేసిన వైసీపీ నాయకులు తమ పాత ధోరణిని కొనసాగిస్తున్నారట. నియోజకవర్గం వ్యాప్తంగా మళ్లీ వారికే పనులు కేటాయిస్తుండటంతో.. ఆ వైసీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారని.. అధికారులు కూడా ఇప్పటికీ వారి మాటే వింటున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా వైసీపీని కట్టడి చేయకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ గల్లంతు అవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారట. మరి ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.