గత జగన్ హాయంలో మూతపడ్డ అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించింది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభంకాగా… పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ కేంద్రంలోనూ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత జగన్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే నాయకర్. పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం మళ్లీ అన్యా క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ అనుపమ, టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో క్యాంటీన్‌ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం శుభ పరిణామమన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి. పేద ప్రజల కడుపు కొట్టడం వల్లే.. జనం జగన్‌మోహన్‌రెడ్డిని బంగాళాఖాతంలో కలిపారని ఆయన మండిపడ్డారు.
తెలుగు దేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి. నంద్యాల జిల్లా డోన్‌లో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌ను ఎదుర్కొంటూ, సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ ముందుకు వెళ్తోందన్నారు. ఈ సందర్భంగా అన్యా క్యాంటీన్లను తొలగించిన వైసీపీపై ఫైర్ అయ్యారు.