తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి KCRపై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద ప్రమాణాలకు నిదర్శనమన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చింది. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ రావు నిలదీశారు. ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా? అని లేఖలో ప్రశ్నించారు.