బెంగళూరు విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సీనియర్ ఐపీఎస్ అధికారి సవతి కూతురు, కన్నడ నటి రన్యా రావు అరెస్టు తర్వాత విచారణలో 17 బంగారు బిస్కెట్లు తీసుకొచ్చినట్టు అంగీకరించారు. విచారణలో ఆమె దుబాయ్ , కొన్ని పాశ్చాత్య దేశాలతో సహా తన అంతర్జాతీయ పర్యటనల వివరాలను కూడా వెల్లడించారు.
రన్యారావు యూరప్, అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, పశ్చిమాసియాకు ప్రయాణించినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కి ఆమె తెలిపారు. తాను బాగా అలసిపోయానని.. కొంత సమయం విశ్రాంతి ఇప్పించాలని విచారణ సమయంలో ఆమె కోరినట్టు అధికారులు తెలిపారు.
గత సంవత్సరంలో ఆమె దుబాయ్‌కు 27 సార్లు వెళ్లి వచ్చింది.. దీంతో ఆమెపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిఘా పెట్టడంతో ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.
దర్యాప్తులో తన కుటుంబ వివరాలను కూడా వెల్లడించింది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.ఎస్. హెగ్దేష్ అని, తన భర్త జతిన్ హుక్కేరి అని, ఆయన బెంగళూరులో తనతో పాటు నివసిస్తున్న ఆర్కిటెక్ట్ అని ఆమె చెప్పింది.
కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావు ఆమె సవతి తండ్రి. రావు అతని రెండవ భార్యకు మొదటి వివాహంలో పుట్టిన ఇద్దరు కుమార్తెలలో రన్యారావు ఒకరు.
33 ఏళ్ల రన్యారావు.. 2014లో కిచ్చా సుదీప్ నటించిన మాణిక్య చిత్రంతో అరంగేట్రం చేసింది. బంగారం స్మగ్లింగ్ కేసులో తదుపరి విచారణ వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున దర్యాప్తు అధికారులకు సహకరిస్తానని ఆమె తెలిపింది..
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రూ.14.56 కోట్ల విలువైన 14 కిలోల బంగారు బిస్కెట్లతో రన్యారావును అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన అతిపెద్ద బంగారం స్మగ్లింగ్ ఇదే. 15 రోజుల్లో నాలుగు సార్లు ఆమె దుబాయ్‌లో పర్యటించడంతో ఆమె కదలికలను ట్రాక్ చేసిన అధికారులు నిఘా పెట్టి రన్యారావును అరెస్టు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు.