ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్నారు. అయితే అనారోగ్యంతోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సెలైన్ బాటిల్ చేతికి పెట్టినప్పుడు వినియోగించే కాన్యులాతో ఆయన సభకు వచ్చారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్‌కి ఎదురుపడ్డ నిమ్మల అనారోగ్యంపై ఆరా తీశారు. అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త అంటూ నిమ్మలకు సూచించారు. విశ్రాంతి తీసుకోండి.. మీరు ఇలాగే సభకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేయిస్తానని చమత్కరించారు. మీకు నిత్యం కళ్ళెదుట పోలవరం..నాకేమో పాఠశాలల అభివృద్ది కనిపిస్తుంటుంది అని చెప్పారు. మీరుకానీ రెస్ట్ తీసుకోకపోతే ..మీకు యాపిల్ వాచ్ కొనిచ్చి మీ స్లీపింగ్ టైంను వాచ్ ద్వారా మానిటరింగ్ చేయాల్సి వస్తుంది.. అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ప్రశాంత నిద్ర వల్లే ఆరోగ్యం కుదుటపడుతుందని నిమ్మలకు మంత్రి లోకేశ్ సూచించారు
అటు సభలో కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నిమ్మల ఆరోగ్యంపై ఆరా తీశారు. డాక్టర్ రామానాయుడు.. మీరు పని రాక్షసుడు.. ప్రజా సేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్ .. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెప్పారు.
సభలో ప్రశ్నోత్తరాఆల్లో.. గోరుగల్లు రిజర్వాయర్ పై సమాధానం ఇచ్చి, తన సీట్లో కూర్చున్న సందర్భంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న రఘురాం కృష్ణంరాజు మంత్రి నిమ్మల.. తామరాకు మీద నీటిబొట్టులా సమాధానం చెప్పారని సరదాగా అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి.. అన్నకు బాగోలేదు.. అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు. చెప్పినా వినడం లేదు. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా అని కోరారు మంత్రి లోకేష్. ఇంతలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. జ్వరం అని నాకు తెలియదు.. రామానాయుడు నాకు చాలా కాలంగా తెలుసు. మా ఊరు పక్కవాడే. పట్టుదల మనిషి. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రా వద్దని రూలింగ్ ఇచ్చి తీరాల్సిందే అధ్యక్షా.. అంటూ సరదాగా అన్నారు.
నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని నిమ్మల బదులిచ్చారు. ఆరోగ్యం సహకరించడంతోనే అసెంబ్లీకి వచ్చానని అసెంబ్లీ లాబీలో లోకేశ్‌తో నిమ్మల పేర్కొన్నారు.