రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధి పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్ట వద్ద రెండు మృతదేహాలను గుర్తించారు. యువతి, యువకుడిని కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపినట్టుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం గాలి పటాలు ఎగురవేగడానికి గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరూ దారుణహత్యకు గురైనట్టు గుర్తించారు. కత్తులతో పొడిచి అనంతరం బండ రాళ్లతో తలపై మోది హత్య చేసినట్టు ఆనవాళ్లున్నాయి. ఘటనా స్థలికి దూరంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేసే కూలీల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, బూట్లను పరిశీలించిన పోలీసులు.. నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే భావిస్తున్నారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో కొన్ని ఆధారాలు సేకరించారు. వాటి ద్వారా మృతుల వివరాలు గుర్తిస్తామని పోలీసులు చెప్పారు.