స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎస్‌ఐ(SI), కానిస్టేబుల్(Constable) ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు శిక్షణకు పోలీస్‌శాఖ(Police Department) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎస్‌ఐ(SI)swa తుది ఎంపిక ఫలితాలు వెలువడినప్పటికీ.. కానిస్టేబుల్ ఎంపిక ఫలితాల వెల్లడి విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీనికి జీవో నం.46కు సంబంధించిన న్యాయవివాదం నడుస్తుండడమే కారణం. అయితే ఆగస్టు(August) నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో కానిస్టేబుల్ తుది ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. అనంతరం 20 రోజుల పాటు ఎంపికైన కానిస్టేబుళ్లపై స్పెషల్ బ్రాంచ్ విచారణ చేపట్టనుంది. ఎలాంటి సమస్య లేనివారి పేర్లను తుది జాబితాలో చేరుస్తారు. అన్నీ సవ్యంగా జరిగితే అక్టోబరు 1 నుంచే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యే 554 మంది ఎస్‌ఐ, 9,871 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరిలో దాదాపు 2,200 మంది మహిళల కోసం ప్రత్యేకంగా మూడు కేంద్రాలను కేటాయించింది. ఎంపికైన ఎస్‌ఐ అభ్యర్థులకు రాజా బహద్దూర్ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి 9 నెలలపాటు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. మైదానాల చదును, శిక్షణార్థులకు వసతి కల్పించే పనులను చేపట్టింది.