స్వతంత్ర, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఎన్ని జన్మలు ఎత్తినా బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మొన్నటి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఘోరంగా ఓడించారని తెలిపారు. మనువు బీజేపీతో మనస్సు చంద్రబాబుతో ఉన్న సీఎం రమేష్, సత్య కుమార్, సుజనా వంటి వారి మాటలను వింటూ తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక ఏపీలో ఉన్నది మాటల ప్రభుత్వమేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసినా విమర్శలపైనా నాని స్పందించారు. హరీశ్ రావుకు మేనమామ కేసీఆర్ మీద కోపం, ఈర్ష్య ఉందని అందుకే కోపం వచ్చినప్పుడల్లా మమ్మల్ని తిడతాడని తెలిపారు. తాము తిరిగి కేసీఆర్‌ను విమర్శిస్తే సంతోషించాలని హరీశ్ అనుకుంటున్నారని ఆరోపించారు. 2018లో హరీశ్ రావు చేతలు ఎక్కువయ్యాయని స్వయంగా కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని పేర్ని వెల్లడించారు.