స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలను అరికట్టే క్రమంలో ఇప్పటికే ఇంటర్‌నెట్ సేవలను నిలిపి వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో ఐదు రోజులకి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండటానికి జూన్ 15 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.
అంతకుముందు ఆ రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సపమ్ రంజన్ మాట్లాడుతూ గడిచిన 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోలేదని తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మణిపుర్ వ్యాప్తంగా 349 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొత్తం 4537 ఆయుధాలను విధ్వంసకారులు దోచుకోగా… 990 ఆయుధాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని స్థాపించడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
కాగా, భద్రతా బలగాలు శనివారం సంయుక్త కూంబింగ్ నిర్వహించాయి. సున్నితమైన కొండ, మైదాన ప్రాంతాలను జల్లెడ పట్టి 22 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. గవర్నర్ అధ్యక్షుడిగా కేంద్రప్రభుత్వం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని జాతుల మధ్య చెలరేగుతున్న అల్లర్లను కట్టడి చేసి, శాంతిని స్థాపించేందుకు ఈ కమిటీ కృషి చేస్తోంది.