తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా కవిత కొత్త పార్టీ పేరు అంశంలో ప్రత్యామ్నాయ పేర్లను ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లెటర్ వచ్చింది. అయితే దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై కవిత లీగల్ ఒపీనియన్ ద్వారా సీఈసీకి సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పేరు ఇవ్వకుండా జాప్యం చేస్తే కోర్టు వరకు వెళ్లి తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీకి దూరం అయిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించారు. కొత్త పార్టీ పేరుపై
కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలను నెల రోజుల పాటు తీసుకుంది.
ఏప్రిల్ 25వ తేదీన కల్వకుంట్ల కవిత మేడ్చల్ మునీరాబాద్‌లో నూతన రాజకీయ పార్టీని ప్రకటన చేశారు .తెలంగాణ రాష్ట్ర సేన పార్టీగా పేరును లాంఛనంగా అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఏప్రిల్ 28 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పేర్ల ఆధారంగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ గా తన పార్టీ పేరును మార్చుకున్నారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు. జెండా పండుగ పేరుతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జెండా గద్దెలను నిర్మించారు. కల్వకుంట్ల కవిత సైతం అనేక ప్రాంతాల్లో జెండా గద్దెలను ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ పేరు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని కవిత అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించక ముందు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా టీఆర్ఎస్ అని పేరు వచ్చే విధంగా కవిత పార్టీని పెట్టారు.
ఇక టీఆర్ఎస్ పార్టీ పేరుపై తొలుత తెలంగాణ రాజ్య సమితి, షోలాపూర్ కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన నుంచి సీఈసీకి అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై కవిత పార్టీ నుంచి రిప్లై వచ్చింది. అయితే ఆ తర్వాత కొత్త పార్టీ పేరుపై ఈసీకి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మార్పుపై పునరాలోచన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లెటర్ పంపింది. ఇదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి పార్టీ పేరును మార్చుకోవాలని చెప్పడం సాధ్యం కాదని కవిత పార్టీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఒకవేళ పార్టీ పేరు విషయంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటన్నింటికి రిప్లై ఇస్తామని కవిత పార్టీ లీగల్ టీమ్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్ళింది.
తమ పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ గానే కొనసాగించాలని కవిత ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ ఈసీ నుంచి అడ్డంకులు వస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టులోనే పార్టీ టైటిల్ అంశాన్ని తేల్చుకోవాలని కవిత టీమ్ రెడీ అవుతోంది. అయితే తొలి రోజు నుంచి కవిత పార్టీ పేరు కాంట్రవర్సీ అయింది. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పేరు ప్రకటించి నాలుగు రోజుల్లోపే తెలంగాణ రక్షణ సేనగా మార్పు చేశారు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాల విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఇదే రకంగా ఉంటే పార్టీ పేరు విషయంలో ప్రజల్లోను గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. మొత్తానికి తన పార్టీ పేరు విషయంలో కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త పేర్లు పంపుతారా లేక తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ టైటిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతారా అనేది చూడాలి.


