దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడే జవాన్లు ఒక్కోసారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతుంటారు. అలా మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా చీపురల్లి మండంలోని పర్ల గ్రామానికి చెందిన చందక్ గోవింద్ విశాఖలోని నేవల్ బేస్ లో మైరెన్ కమాండర్ గా పనిచేస్తున్నాడు. అయితే పారా గ్లైడింగ్ శిక్షణ కోసం కోల్ కత్తా వెళ్లాడు. అక్కడ శిక్షణ సమయంలో హెలికాఫ్టర్ నుంచి కిందకు దిగే సమయంలో పారాచ్యూట్ తెరుచుకోకపోవడంతో వేల అడుగుల ఎత్తులో నుంచి కిందకు పడిపోయాడు. తీవ్రగాయాలతో గోవింద్ కన్నుమూశాడు. ఈ దుర్ఘటనతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
గోవింద్ మృతదేహాన్ని విశాఖలోని ఐ.ఎన్.ఎస్ కర్ణలో ఉంచిన ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం స్వగ్రామానికి తరలించారు. మృతదేహం చేరుకోగానే తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అంటూ భోరున విలపించారు. జవాన్ గోవింద్ ను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. 20కిలోమీటర్ల మేర గోవింద్ అంతిమయాత్ర జరిగింది. అమర్ రహే గోవింద్, జై జవాన్ అంటూ పెద్ద ఎత్తున జనాలు నినాదాలు చేశారు. అధికారిక లాంఛనాలతో గోవింద్ అంత్యక్రియలు ముగిశాయి.