స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిచిపోగా, ఈ నెల 29 నుంచి మళ్లీ మొదలుపెట్టాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అయితే, లోకేశ్ తన పాదయాత్రను వాయిదా వేసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. అక్టోబరు 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు వాదనలు ఉండడంతో, పాదయాత్రను మరో తేదీకి వాయిదా వేయాలని టీడీపీ నేతలు లోకేశ్ కు సూచించారు. చంద్రబాబు కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని, పాదయాత్రలో ఉంటే సంప్రదింపులు కష్టమవుతాయని, లోకేశ్ ఢిల్లీలో ఉంటేనే మంచిదని వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. టీడీపీ నేతల అభిప్రాయాలతో నారా లోకేశ్ ఏకీభవించారు. యువగళం పాదయాత్ర తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలో నేతలతో చర్చించి పాదయాత్రకు మరో తేదీని ప్రకటించనున్నారు.