విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడంతో వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అడ్డుకున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ షర్మిల పట్ల పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని న్యాయమూర్తికి చెప్పారు. ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని.. పోలీసులు తనను అడ్డుకొని కొట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం తాను పోలీసులను పక్కకు తోసేశాను అని పేర్కొన్నారు.
ఇక పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసులపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా పోనివ్వని చెప్పడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ కాలికి గాయాలయ్యాయని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.