విద్యుత్ ఛార్జీలు పెంచడంపై వైసీపీ పోరుబాట చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని ఫ్యాన్ పార్టీ మండిపడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. ఇంతకు ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం మోపింది. దీనిపై వైసీపీ నేతలు ఏమంటున్నారు..?
విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై కూటమి ప్రభుత్వం పెను భారం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూటమి సర్కారు ప్రజలపై అదనపు భారం మోపుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ..నేడు ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరు నెలల్లోనే ప్రజలపై 15 వేల కోట్ల రూపాయల అదనపు భారం వేయడం దారుణమని విమర్శిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మాటలకు ఇప్పటి చేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
విద్యుత్ బిల్లుల బాదుడుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా..15వేల 485 కోట్ల రూపాయల బాదుడుకి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.
చంద్రబాబు అధికారంలో పెరిగినంతగా విద్యుత్ ఛార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచం, తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేసినందుకు జనం చెంపలేసుకొని, జగన్ వెంట నడుస్తున్నారని అన్నారు.
నగరిలో మాజీ మంత్రి రోజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు ష్యురిటీ.. బాదుడు గ్యారంటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు. ఓటేసిన ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కాటేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలపై మోయలేని విద్యుత్ చార్జీల భారం మోపారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ఎగనామం పెట్టారని ఎద్దేవా చేశారు.
మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. సూపర్ సిక్స్ అన్నారు..భవిష్యత్తుకు తమది గ్యారంటీ అన్నారు..ఒక్క హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని గుడివాడ ఫైర్ అయ్యారు. ఒకేసారి విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని, విడతల వారీగా పెంచుతున్నారని అన్నారు.
చంద్రబాబు మోసం మరోసారి బయటపడిందని కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రజలపై పన్నుల భారం, విద్యుత్ ఛార్జీల పెంపు, అప్పులే చంద్రబాబు సంపద సృష్టి ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలపై భారం వేశారని విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలకు దిగారు. ఉదయం నుంచి అన్నీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఆరు నెలల్లోనే ప్రజలను విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడు మొదలుపెట్టిందని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.